మరణం అంచుకు చేరే ప్రతి క్షణం పెద్ద నరకం.. వృద్ధాప్య సవాళ్లు
జననం, మరణం జీవితంలో అనివార్యాలు. వృద్ధాప్యంలో మరణ భయం, ఒంటరితనం, శారీరక, మానసిక సవాళ్లు తీవ్రమవుతాయి. పెరుగుతున్న సీనియర్ సిటిజన్ల జనాభాకు సమాజం మద్దతునివ్వాలి. థాయ్‌లాండ్‌లోని డెత్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాలు మరణంపై అవగాహన కల్పిస్తాయి. వృద్ధులను గౌరవించి, వారి చివరి రోజులను మెరుగుపరచడం మన సామాజిక బాధ్యత.
మనిషి ప్రమేయం లేకుండానే అతని జీవితంలో రెండు మహాద్భుతాలు జరిగిపోతుంటాయి.. ఒకటి జననం, రెండు మరణం. జననం అనేది ఒక తెలియని నరకం అయితే, మరణం అనేది తెలిసీ అనుభవించే నరకం. అందుకే మనిషికి మరణం అంటే అంత బెంగ, అంత ఆందోళన. విచిత్రమేమిటంటే, ఈ ఆందోళన జీవితంలోని ఏ దశలోనూ మనల్ని అంతగా పలకరించదు. బాల్యంలో అది అసలు తెలియదు. పడుచు ప్రాయంలో ఉరకలెత్తే ఉత్సాహం ముందు చావు ఊసే రాదు. ఇక నడి వయసులో బాధ్యతల భారాలు, బతుకు పోరాటాలు, సంసార సాగరంలో మెదడు నలిగిపోతూ మరణం గురించి ఆలోచించే తీరికే ఇవ్వదు.కానీ, అసలు సిసలు పరీక్ష చరమాంకంలో మొదలవుతుంది. ఈ భౌతిక లోకంలో అన్ని బాధ్యతలను నెరవేర్చి, తీరికగా పడక కుర్చీకి పరిమితమైనప్పుడు.. నిశ్శబ్దం మనల్ని ఆవహిస్తుంది. అప్పుడు ఇబ్బడిముబ్బడిగా చావు గురించిన ఆలోచనలు తరుముకు వస్తుంటాయి. గతాన్ని నెమరువేసుకుంటూ, రేపటి శూన్యాన్ని చూస్తూ మనిషి చేసే ఆ ప్రయాణం అత్యంత భారమైనది. అన్నిటినీ గెలిచిన మనిషి, ఆఖరికి తనలో తలెత్తే ఈ మరణ భయాన్ని గెలవలేక సతమతమవుతుంటాడు. మనిషి వయసు మళ్లిన కొద్దీ తన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా మారిపోతుంది. తనతో పాటు నడిచిన వారు, ప్రాణ స్నేహితులు, తోబుట్టువులు, చివరికి జీవిత భాగస్వామి.. ఇలా ఒక్కొక్కరుగా మృత్యువు ఒడిలోకి చేరుతుంటే, మిగిలిన వారికి ఆ శూన్యం ఒక భయంకరమైన హెచ్చరికలా అనిపిస్తుంది. రేపు నా వంతు ఎప్పుడన్న ఆందోళన మెదడును నిరంతరం తొలిచేస్తుంటుంది.ఇంట్లో పెద్ద దిక్కుగా మిగిలిపోయినప్పటికీ, సొంత వారికే వారు పరాయివారిలా కనిపిస్తుంటారు. పాత తరానికి, కొత్త తరానికి మధ్య పెరిగిన ఆ Generation Gap ఒక అగాధంగా మారుతుంది. మనసులోని మాటను పంచుకుందామన్నా వినే ఓపిక ఎవరికీ ఉండదు. వేవ్ లెంగ్త్ కలవని ఈ లోకంలో వారు ఏది మాట్లాడినా అది ‘చాదస్తం’గానో, ‘పాతకాలపు నస’గానో ఉంటుంది. అదే సమయంలో శరీరం సహకరించదు, కాలు కదలదు, కంటిచూపు మందగిస్తుంది, మాట తడబడుతుంది.. కానీ మెదడు మాత్రం మొండిగా, చురుకుగా పనిచేస్తూనే ఉంటుంది. గతాన్ని గుర్తుచేస్తూ, వర్తమానంలోని నిరాదరణను ఎత్తిచూపుతూ ఆ చురుకైన మెదడే వారికి ఒక శాపంగా మారుతుంది. శారీరక అసక్తత కంటే, మానసిక ఏకాంతం ఇచ్చే వేదనే వృద్ధాప్యంలో అతిపెద్ద భారంగా మారుతుంది. మన దేశం నిండా వయో వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారతదేశంలో సీనియర్ సిటిజన్ జనాభా అత్యంత వేగంగా పెరుగుతోంది, 2050 నాటికి వీరి సంఖ్య 347 మిలియన్లకు అంటే మొత్తం జనాభాలో ఐదవ వంతుకి చేరుకుంటుంది అని అంచనా వేస్తున్నారు. వీరిని గౌరవంగా చూడాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. వీరిని ఆదరించి అక్కున చేర్చుకోవాలని అండగా తాము ఉన్నామని ఒక భరోసా ఇస్తే వారి చివరి రోజులు ఎంతో కొంత మెరుగ్గా సాగుతాయని సామాజిక వేత్తలు సైతం సూచిస్తున్నారు. అయితే అత్యధిక శాతం వృద్ధులు మాత్రం దేశంలో వివక్షకు గురి అవుతున్నారు. థాయ్‌లాండ్‌లోని నాంతబురిలో మరణంపై అవగాహన కల్పించేందుకు ఇటీవల కొందరు డెత్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. మృత్యువుకు భయపడకుండా.. దాన్ని హత్తుకోండని వారన్నారు విచిత్రంగా, ఈ డెత్‌ఫెస్టివల్‌లోని టెస్ట్ డై ప్రదర్శనలో పాల్గొన్న వారు శవపేటికల్లో పడుకుని, పైన అమర్చిన అద్దాలలో తమను తాము చూసుకుంటారు. మరణం మాత్రమే కాకుండా జీవితంలో అనివార్యమైన ఎన్నో అంశాలకు సంబంధించి, ఈ ఫెస్ట్‌లో పాల్గొనే వారికి ఆచరణాత్మక, ఆధ్యాత్మిక సలహాలను కూడా అందించారు. జీవితంలో ఎవరూ తప్పించుకోలేని పలు బాధలైన పుట్టుక, వృద్ధాప్యం, అనారోగ్యం, చావు అనే బౌద్ధ మతంలోని పలు ప్రధాన అంశాలపై ఇందులో వివరించారు. ఈ ఫెస్ట్‌లో పర్యావరణ హితమైన శవపేటికలను ప్రదర్శించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊపిరి తీసిన రీల్స్ పిచ్చి.. లైక్స్ కావలి అంటే ప్రాణాలు పోవాల్సిందేనా ??
