కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా

Updated on: Jan 07, 2026 | 5:37 PM

నంద్యాల జిల్లా మద్దూరు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దారుణం వెలుగు చూసింది. ఆలయ అధికారి, ప్రధాన అర్చకుడు కలిసి స్వామివారి 10-15 కిలోల వెండి ఆభరణాలను అమ్మి, వాటి స్థానంలో వెండి పూత పూసిన గిల్టు నగలు పెట్టారు. వైకుంఠ ఏకాదశి నాడు గ్రామస్తులు అనుమానించడంతో మోసం బట్టబయలైంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆలయ నిర్వహణకు, రక్షణకోసం నియమించిన అధికారి, ఆలయంలో పూజాదికాలు నిర్వహించే అర్చకుడు కలిసి దేవుడి సొమ్మును దిగమింగేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మద్దూరు గ్రామంలో దశాబ్దాల క్రితం గ్రామస్తులంతా కలిసి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. స్వామివారికి గ్రామస్తులంతా కలిసి వెండి కిరీటము, శంకు,చక్రం, పాదపద్మములు తదితర ఆభరణాలను చేయించారు. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజున ఆభరణాలన్నీ స్వామివారికి అలంకరించి పూజలు నిర్వహించేవారు. ఆభరణాలన్నీ ఆలయ అధికారి ఈవో, ప్రధాన అర్చకుడు కిషోర్‌ శర్మ సంరక్షణలో ఉండేవి. 2025 జూలై నెలలో ఆలయ అధికారిగా పనిచేసిన నరసయ్య బదిలీ, ఆ తర్వాత రిటైర్ అయ్యారు. కొత్త ఈవోగా జయచంద్రారెడ్డి వచ్చారు. అయితే, పదవీ విరమణ చేసిన నరసయ్య.. కొత్త ఈవోకి ఆదాయ వ్యయాల లెక్కలు గానీ, స్వామి నగల వివరాలు గానీ చెప్పలేదు. దీంతో ఉన్నతాధికారులకు ఈవో జయ చంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. డిసెంబరు 30 వైకుంఠ ఏకాదశి కావడంతో స్వామికి అలంకరణ చేసే క్రమంలో ఆలయం తరపున చేయించిన వెండినగలను బయటకు తీశారు. అయితే.. ఆ వెండి కిరీటం, నగలు తేడాగా ఉన్నాయంటూ గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయటంతో పూజారి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడు. అనంతరం గ్రామస్తులంతా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు మాజీ ఈవో నరసయ్య అర్చకుడు కిషోర్ శర్మ లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిద్దరూ కలిసి అసలు నగలు అమ్ముకుని, వాటి స్థానంలో వెండి పూత పూసిన గిల్టు నగలు పెట్టినట్లు నిర్ధారణ అయింది. వీరు వెండి నగలను ఆళ్లగడ్డలోని ఓ వెండి వ్యాపారికి విక్రయించారని, ఆ నగల బరువు పది నుంచి 15 కిలోల వరకు ఉండొచ్చని సమాచారం. ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ చెప్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విజయ్‌ సినిమాకు సెన్సార్ చిక్కులు కోర్టుకెక్కిన హీరో

Janhvi Kapoor: ఆస్కార్‌కు అడుగు దూరంలో జాన్వీ మూవీ

The Raja Saab: క్లైమాక్స్ నెక్స్ట్ లెవల్‌.. మామూలుగా ఉండదు

ఓవైపు జైల్లో భర్త.. మరోవైపు వేధింపులు.. దారుణంగా దర్శన్ భార్య పరిస్థితి

Thalapathy Vijay: బాలయ్య దెబ్బకు.. షాక్‌లోకి విజయ్‌ !! ట్రెండింగ్‌లో నటసింహం