Khammam: సండే చేపల పులసు తినాలనుకుంటే సీన్ సితార అయ్యింది

| Edited By: Ram Naramaneni

Dec 01, 2024 | 4:04 PM

ఆదివారం రోజు కొందరికి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. చికెన్ ,మటన్ , చేప..ఇలా ఏదో ఒకటి ఉండాల్సిందే..ఖమ్మం జిల్లాలో సండే చేపల పులుసు తినాలనే  కోరిక ఒక వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది..బ్రతుకు జీవుడా అంటూ బయట పడ్డాడు..అసలు ఏమి జరిగిందంటే...

ఖమ్మం జిల్లా మధిర మండలం మల్లారం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఆనందంగా చేపల పులుసు తినాలనే కోరికతో సిరిపురం గ్రామానికి చెందిన రాజు వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. ఊరి చివర మల్లారం వెళ్లే రోడ్డులో చిన్న కాల్వలోకి దిగాడు. త్వరగా చేపలు దొరికితే ఇంటికి వెళ్లి కూర వండుకొని తినాలనే ఆరాటంతో.. కాల్వ లోపలి నుంచి.. అక్కడే ఉన్న మోరీలోకి పాక్కుంటూ చొచ్చుకెళ్లాడు. ఇంకేముంది.. చేపల సంగతి దేవుడెరుగు.. మోరీ ఇరుకుగా ఉండటంతో..అందులోనే ఇరుక్కు పోయాడు..బయటకు రాలేక..ముందుకు కదిలే పరిస్థితి లేక..అక్కడే ఉన్నాడు..కొద్ది సేపటికి ఊపిరి ఆడని పరిస్థితి..కేకలు వేయడంతో..అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి ప్రయత్నం చేశారు.. వీలు కాక పోవడంతో..రెండు జేసీబీలతో అటు వైపు..ఇటు వైపు మట్టి ,చెట్లు తొలగించారు..ఈ లోపు పెద్ద ఎత్తున గ్రామస్థులు తరలి వచ్చి..ఎలాగైనా బయటకు తీసుకు రావాలని.. రకరకాల ఉపాయాలు రచించి.. తీవ్రంగా శ్రమించి..రాజును బయటకు తీసుకు వచ్చారు. అతడిని ప్రాణాలతో బయట పడిన ఆనందంలో ఎగిరి గంతేసారు. హమ్మయ్యా అంటూ రాజు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కొందరు పెద్ద మనుషులు మాత్రం చేపల కోసం అతడు చేసిన పనిని తప్పు పట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి