మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ

Updated on: Jan 17, 2025 | 7:02 PM

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ స్థలం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ భక్త జనసంద్రాన్ని తలపిస్తోంది. తెల్లవారుజామున లక్షలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తారు. తీవ్రమైన చలి ఉన్నా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. రెండో రోజు కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మకర సంక్రమణం సందర్భంగా షాపీ స్నాన్‌కు భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు రోజుల్లో మొత్తం 2 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్టు సమాచారం. మరో 43 రోజుల పాటు కుంభమేళా జరగనుంది. ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తోంది ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం. సాధువుల శంఖనాదాలు, భజనలతో ప్రయాగ్‌ రాజ్‌ పులకించిపోతోంది.

 హర్‌ హర్‌ మహాదేవ్‌, జై శ్రీరాం, జై గంగామయ్య నామస్మరణతో ప్రయాగ్ రాజ్‌ మార్మోగుతోంది. సాధువులతో కుంభమేళా ప్రాంగణం నిండిపోయింది. సాధువుల ఆశీర్వాదం కోసం భక్తులు ఉత్సాహం చూపించారు.కుంభమేళాకు అఘోరాలు, నాగసాధువులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళాకు విదేశాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. నదీస్నానం ఆచరించి సాధువుల ఆశీర్వాదం తీసుకుంటున్నారు. భక్తుల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 12 వందల 96 ఛార్జీతో మహాకుంభ మేళా, ప్రయాగ్‌రాజ్‌ నగరాలను గగనతలం నుంచి వీక్షించే అవకాశం కల్పించింది.

Published on: Jan 17, 2025 07:01 PM