కమ్మటి పిజ్జాలో కత్తి ముక్క.. షాకైన కస్టమర్‌!

|

Jan 09, 2025 | 7:19 PM

టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఏది కావాలన్నా ఒక్క క్లిక్‌తో కళ్లముందు ప్రత్యక్షమవుతోంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత జనాలు కూర్చున్న దగ్గరనుంచి కదలకుండా అన్ని అవసరాలూ తీరిపోతున్నాయి. కాఫీ నుంచి భోజనం వరకూ క్షణాల్లో కళ్లముందుకు వచ్చి వాలిపోతున్నాయి. దీంతో బ్యాచిలర్స్‌ నుంచి గృహస్తుల వరకూ చాలామందికి వంట టెన్షన్‌ తప్పింది. అయితే ఈ ఆహారం క్వాలిటీ మాటేమిటి? అంటే.. ఈ విషయానికి వస్తే ఇటీవల రైళ్లలో ఆహారం దగ్గర నుంచి ప్రముఖ హోటళ్లలో వడ్డించే ఆహారంలో కస్ట్‌మర్స్‌కి చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. బిర్యానీలో బొద్దింకలు, బ్లేడు ముక్కలు, జెర్రిలు ఇలా ఎన్నెన్నో దర్శనమిచ్చాయి.

ఇందుకు ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన ఆహారం కూడా మినహాయింపు కాదు. అందుకు సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. పిజ్జాలో ఏకంగా ఇనుప చాకు ముక్క కనిపించి కస్టమర్‌ను కంగారు పెట్టింది. హోటల్‌ నుంచి పిజ్జా ఆర్డర్‌ చేసిన ఓ వ్యక్తికి ఈ భయానక అనుభవం ఎదురైంది. ఈ ఘటన మహారాష్ట్ర చోటు చేసుకొంది. పుణెకి చెందిన ఓ పిజ్జా స్టోర్ నుంచి అరుణ్‌ అనే వ్యక్తి పిజ్జా ఆర్డర్‌ చేశాడు. దాన్ని తింటుండగా.. తనకు ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించింది. వెంటనే దాన్ని నోటి నుంచి బయటకు తీసి పరిశీలించగా.. అది కత్తిలో ఓ ముక్కగా తేలింది. అనంతరం తాను పిజ్జా ఆర్డర్‌ చేసిన అవుట్‌లెట్‌కు ఫోన్‌ చేసి విషయం తెలియజేశాడు. అయితే.. తొలుత దీనిని తోసిపుచ్చిన షాపు మేనేజర్‌ ఆ తర్వాత కస్టమర్‌ ఇంటికి వచ్చి పరిశీలించాడు. ఆధారాలు చూపడంతో తప్పును అంగీకరించి క్షమాపణలు కోరాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘‘రూ.596తో పిజ్జా ఆర్డర్‌ చేశా. దాన్ని తింటుండగా మధ్యలో పంటికి ఏదో గట్టిగా తగిలింది. దాంతో ఏమై ఉంటుందా అని తీసి చూసాను. పిజ్జాలో కత్తిలో ఓ ముక్క రావడం చూసి షాకయ్యా. వాళ్ల నుంచి ఇలాంటి సేవలు బాధాకరం. ఇది నిర్లక్ష్యం మాత్రమే కాదు. ప్రాణాలకే ప్రమాదకరం. మీరు ఆహారాన్ని ఆర్డర్‌ చేసిన తర్వాత జాగ్రత్త వహించండి’’ అని అరుణ్‌ పేర్కొన్నాడు.