అన్నం కోసం వస్తే.. ప్రాణమే పోయింది

Updated on: Oct 27, 2025 | 7:51 PM

కేరళలోని ఇడుక్కి జిల్లా ఆదిమలిలో శనివారం రాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. హృదయ విదారక ఘటనలో భర్త ప్రాణాలు కోల్పోగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది అసలేం జరిగిందంటే.. ఆదిమలి సమీపంలోని మన్నంకండం ప్రాంతంలో జాతీయ రహదారి-85 విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీని కోసం కొండలను తవ్వుతుండటంతో భారీ పగుళ్లు ఏర్పడ్డాయి.

ఏ క్షణంలోనైనా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు, కొండ దిగువన నివసిస్తున్న 22 కుటుంబాలను శనివారం సాయంత్రమే ఇళ్లు ఖాళీ చేయించి సహాయక శిబిరాలకు తరలించారు. వారిలో లక్షంవీడు కాలనీకి చెందిన బీజు, ఆయన భార్య సంధ్య కూడా ఉన్నారు. అయితే, శిబిరంలో భోజన ఏర్పాట్లు లేకపోవడంతో రాత్రి వంట చేసుకుని తినేందుకు బీజు, సంధ్య తిరిగి తమ ఇంటికి వెళ్లారు. వారు వంట చేస్తున్న సమయంలో రాత్రి 10:30 గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కొండచరియలు వారి ఇంటితో పాటు చుట్టుపక్కల ఉన్న మరో ఏడు ఇళ్లపై కూలాయి. క్షణాల్లో ఇళ్లన్నీ మట్టిదిబ్బలుగా మారిపోవటంతో అక్కడున్న వారంతా సజీవ సమాధి అయ్యారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు ఐదు గంటల పాటు శ్రమించి శిథిలాల కింద నుంచి బీజు, సంధ్యలను బయటకు తీశారు. అయితే, అప్పటికే బీజు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న సంధ్యను సమీపంలోని ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం అలువాలోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాదే తమ కుమారుడిని కోల్పోయిన బీజు కుటుంబంలో ఈ ఘటన మరో తీవ్ర విషాదాన్ని నింపింది. వారి కుమార్తె కొట్టాయంలో నర్సింగ్ చదువుతోంది. ఘటనపై ఆదిమలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం బీజు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Shreyas Iyer: ICUలో టీమిండియా క్రికెటర్ శ్రేయస్‌ అయ్యర్‌

వైట్‌హౌస్‌లో కూల్చివేతలు.. జనం మాట పట్టించుకోని ట్రంప్

కర్నూలు బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతంలో మరో యాక్సిడెంట్

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ.. శివాలయాలకు పోటెత్తిన భక్తులు

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి డీప్‌ ఫేక్‌ వీడియో

Published on: Oct 27, 2025 07:48 PM