అర్చకుల విదేశీయానం ధర్మ విరుద్ధమా ??
విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అనర్హులంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. విజయవాడ దుర్గగుడి అర్చకులకు వర్తించే ఈ తీర్పు సనాతన ధర్మం, ఆగమ శాస్త్రాల ఆధారంగా ఇవ్వబడింది. అయితే, అర్చకులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆధునిక ప్రయాణాలు, ప్రాయశ్చిత్త కర్మలతో దోష నివారణ సాధ్యమని కొందరు వాదిస్తుండగా, మరికొందరు శాస్త్రాలను కఠినంగా పాటించాలని కోరుతున్నారు. ఈ అంశంపై చర్చ తీవ్రమైంది.
సప్త సముద్రాలు దాటి విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ గర్భాలయాల్లో పూజలు చేసేందుకు అనర్హులంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సనాతన ధర్మం, ఆగమ శాస్త్రాల ప్రకారం విదేశీయానం చేసిన వారు గర్భాలయ ప్రవేశానికి అర్హులు కాదని కోర్టు స్పష్టం చేయడంతో పండిత వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడ దుర్గగుడిలో విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులను గర్భాలయంలో పూజలకు అనుమతించడాన్ని సవాలు చేస్తూ సుబ్రహ్మణ్యం సోమయాజి అనే పండితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2010 నాటి ఉత్తర్వులను, శృంగేరీ పీఠం ప్రామాణికతను అమలు చేయాలని ఆయన కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. విదేశీ పర్యటనలు చేసిన అర్చకులను గర్భాలయ పూజల నుంచి దూరంగా ఉంచాలని దేవాదాయ శాఖను ఆదేశించింది. కోర్టు తీర్పుపై అర్చకులు భిన్నంగా స్పందిస్తున్నారు. దైవం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, విశ్వవ్యాప్తమని వారు వాదిస్తున్నారు. ఇది శాస్త్ర విరుద్ధమని ఓ వర్గం చెబుతుండగా, దైవం విశ్వ వ్యాప్తమని పశ్చాత్తాపాలతో పరిహారం చేసుకుంటే ఎటువంటి దోషాలు ఉండవని మరో వర్గం భావిస్తోంది. విదేశాలకు వెళ్లినందుకు దోషం ఉన్నా, ప్రాయశ్చిత్త హోమాలు, జపాలు చేసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు. పూర్వం సముద్ర ప్రయాణాలు నెలల తరబడి సాగేవి కాబట్టి సంధ్యావందనాదులకు ఆటంకం కలిగేదని, ఇప్పుడు విమాన ప్రయాణాల వల్ల కొన్ని గంటల్లోనే చేరుకుంటున్నామని, అక్కడ కూడా నిత్య విధులను పాటిస్తున్నామని పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం తరఫునే అర్చక బృందాలను విదేశాలకు పంపిన సందర్భాలను వారు గుర్తు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఓ ప్రాంతానికే పరిమితమైన తల్లి కాదని ఆమె ఈ విశ్వానికి విశ్వమాతగా పూజలందుకుంటున్నారని పండితులు అంటున్నారు. విశ్వవ్యాప్తంగా తెలుగువారు అన్ని దేశాల్లో స్థిర నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. అలాగే అక్కడ కూడా హిందూ సంప్రదాయాలు, దేవాలయాలు, పూజలు చేస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాణం పోస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లో జరిగే ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలకు ఒక్కో సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫునే దుర్గగుడి అర్చకులను పంపిస్తూ ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ చర్చ ఎందుకు రాదని వారు ప్రశ్నిస్తున్నారు. ధర్మ సింధు, నిర్ణయ సింధు వంటి శాస్త్రాల ప్రకారం కఠిన నియమాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత కాలంలో అన్నీ తూచా తప్పకుండా పాటించడం అసాధ్యమని అర్చకులు అంటున్నారు. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కొందరు ఈ వివాదాన్ని లేవనెత్తారని మండిపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, న్యాయం కోసం తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బాధిత అర్చకులు స్పష్టం చేశారు. మొత్తానికి, సాంప్రదాయ ధర్మాలకు మరియు ఆధునిక జీవనశైలికి మధ్య జరుగుతున్న ఈ పోరాటం ఇప్పుడు ఆధ్యాత్మిక, న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణం తీసిన చేప.. మృతి వెనుక అసలేం జరిగింది ??
బురఖాలో వచ్చింది.. గన్ బయటకు తీసింది.. ఆ తర్వాత..
ఆ అర్చకులకు గర్భాలయంలోకి నో ఎంట్రీ
