లచ్చిందేవి కరుణించింది..డ్రైవర్‌కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది!వీడియో

లచ్చిందేవి కరుణించింది..డ్రైవర్‌కు రూ.10 కోట్ల లాటరీ తగిలింది!వీడియో

Samatha J

|

Updated on: Jan 27, 2025 | 8:02 AM

ఆవగింజంత అదృష్టం ఉన్నా.. కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరుడైపోతాడు అంటూ ఉంటారు. అది అక్షర సత్యం అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. అవును అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలీదు. పంజాబ్‌కు చెందిన ట్రక్‌ డ్రైవ‌ర్ జాక్‌పాట్ కొట్టాడు. పంజాబ్ స్టేట్ డియ‌ర్ లోహ్రీ మ‌క‌ర్ సంక్రాంతి బంప‌ర్‌-2025లో రూప్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన హ‌ర్పింద‌ర్ సింగ్ రూ.10 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పటివ‌ర‌కు రాష్ట్రంలో అతిపెద్ద లాట‌రీ ప్రైజ్‌మ‌నీ ఇదే కావ‌డం విశేషం.

హ‌ర్పింద‌ర్ సింగ్ కువైట్‌లో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పంజాబ్‌లోని రోపర్ జిల్లా బద్వా గ్రామానికి చెందిన అత‌డు ఇటీవ‌ల సెల‌వుల‌పై ఊరికి తిరిగొచ్చాడు. తన కుటుంబాన్ని కలవడానికి గ్రామానికి వచ్చిన హర్పిందర్ సింగ్… రోపర్ జిల్లా, నూర్పూర్ బేడి పట్టణంలోని అశోకా లాటరీ నుంచి రూ. 500 పెట్టి లాట‌రీ టికెట్ కొన్నాడు. అదే అత‌డిని విజేతగా నిల‌ప‌డంతో పాటు రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. తాను క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొనేవాడినని.. ఈసారి నేను లోహ్రీ బంపర్ టిక్కెట్లను కొనుగోలు చేశానన్నాడు హర్పిందర్. తాజాగా తాను లాట‌రీ గెలిచిన‌ట్లు అశోక లాటరీ నుంచి కాల్ వచ్చిందని చెప్పారు.తాను బ్రతువుదెరువు కోసం చాలా అప్పులు చేసుకొని కువైట్‌ వెళ్లానని, ఇప్పుడు కుటుంబాన్ని చూసుకోడానికి వచ్చిన తనకు.. ఈ లాటరీ తగలడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని, చాలా కాలంగా ట్రక్కులు నడుపుతున్నానని హర్పిందర్ తెలిపాడు. తాను గెలిచిన ఈ భారీ మొత్తంలో కొంత భాగాన్ని పేదలకు సహాయం చేయడానికి, మ‌రికొంత భాగాన్ని త‌న కుటుంటం కోసం వెచ్చిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. ప్రైజ్ మనీలో 30 శాతం.. ఆదాయపు పన్నుగా కట్ అవుతుంది. సో.. మిగిలిన మొత్తంతోనే సింగ్ తన పనులు చేయాల్సి ఉంటుంది.