పెళ్లిలో ఎన్నో సంప్రదాయాలు, కట్టుబాటులు, పద్ధతులు ఉంటాయి. మన భారతదేశంలో ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో రకంగా పద్ధతులు మారిపోతూ ఉంటాయి. కొన్ని సంప్రదాయాలు విచిత్రంగా ఉంటాయి.. మరికొన్ని అయితే చూస్తే నవ్వు వచ్చే విధంగా ఉంటాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కొన్నిసార్లు సరదాగా పాటించే పద్ధతులు సీరియస్ టర్న్ తీసుకుంటే ఇదిగో ఇలానే ఉంటుంది. ఈ పెళ్లి గుజరాత్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది.
గుజరాత్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో ఓ వింత ఆచారాన్ని పెద్దలు పాటించారు. అదేంటంటే.. వరుడి తమ్ముడితో వధువు ఆటలు ఆడాలి. ఒకవేళ వరుడికి తమ్ముడు లేకపోతే.. చెల్లెలి వరసైన వారితో ఆడిస్తారు. ఆటల్లో భాగంగా వధువు, వరుడి తమ్ముడు ఒకరినొకరు నెమలి పింఛాలతో కొట్టుకోవాల్సి ఉంది. ఈ నెమలి పింఛాలతో కొట్టుకునే ఆట పేరు శాంతిగేమ్ అంటారు. అయితే ఇది ఒక సంప్రదాయమే కానీ వరుడి తమ్ముడుకు ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆవేశంతో వధువును నెమలిపింఛాలతో చితకబాదటం మొదలు పెట్టాడు. పాపం ఏం అర్ధం కానీ వధువు అలా నిలబడి ఉండిపోయింది.
ఇంతలో చుట్టూ ఉన్న పెద్దలు కుర్రోడిని ఆపే ప్రయత్నం చేశారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇక వరుడే స్వయంగా తన తమ్ముడికి దేహబుద్ధి చేశాడు. ఆచారాలు , సంప్రదాయాలు పక్కన పెడితే.. పెళ్లిలో కొట్టుకోవడం ఏంటో.? అది కాస్తా సీరియస్ కావడం ఏంటో.? శాంతి పూజ విన్నాం కానీ శాంతిగేమ్ పేరుతో కొట్టుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.