Dog Birthday: కొంతమంది తమ పెంపుడు కుక్కలపై చూపించే ప్రేమ.. వాటికోసం పెట్టె ఖర్చులు చూస్తే సామాన్యులు మనం కూడా వాటిల్లా అయితే బాగుండుని ఈర్షపడిన సందర్భాలు ఎదురవుతుంటాయి. తాజా ఓ మహిళ.. తన పెంపుడు కుక్క పుట్టిన రోజుని భారీగా సెలబ్రేట్ చేసింది. కుక్క పుట్టిన రోజు కోసం ఏకంగా కోట్లు ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఆమె సమస్యల్లో ఇరుక్కుంది. వివరాల్లోకి వెళ్తే..
చైనాకు చెందిన ఓ మహిళ లేనిపోని ఆర్భాటాలకు పోయి సమస్యలు కొని తెచ్చుకుంది. కోట్లు ఖర్చు పెట్టి.. అదికూడా ఒకటి రెండూ కాదు.. ఏకంగా 11 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన పెంపుడు కుక్కకి బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసింది. అందుకు 520 డ్రోన్లు అద్దెకు తీసుకుంది. రాత్రివేళ ఆ డ్రోన్లను గాల్లోకి పంపింది. అవి చాంగ్షాలోని జింజియాంగ్ నదిపై ఎగురుతూ… చైనా మాండరిన్ భాషలో “పదో పుట్టిన రోజు శుభాకాంక్షలు దౌదౌ” అని కనిపించేలా ఎగిరాయి. డ్రోన్లకు ఉన్న లైటింగ్ వల్ల… అవి అక్షరాల్లో కనిపించాయి. ఆ డ్రోన్లు బర్త్‌డే కేక్ లాగా… ఆకాశంలో బాక్స్ నుంచి జాక్ పైకి వచ్చినట్లుగా… ప్యాట్రన్స్ చేశాయి. స్థానికులు వాటిని ఆశ్చర్యంగా చూశారు.
ఆమె తన కుక్క పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కు 520 డ్రోన్లను అద్దెకు తీసుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. మన దేశంలో 143 అంటే ఐలవ్ యూ ఎలాగో… చైనా భాషలో 520 అంటే ఐ లవ్ యూ అని అర్థం. అందుకే అన్ని తీసుకుంది. అయితే ఒక్కసారిగా అన్ని డ్రోన్లు గాల్లో ఎగిరేసరికి స్థానికులు కంగారు పడ్డారు. ఈ విషయం పోలీసులవరకూ వెళ్లింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్లను కిందకి దింపించి అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేయడంతో మహిళకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పైగా కుక్క పేరుతో అంత డబ్బు వృథాగా వేస్ట్ చేసే బదులు… ఏ అనాథ శరణాలయానికో, పేదలకో ఇస్తే… చాలా మందికి మేలు జరుగుతుంది. ఇలా గాల్లో డ్రోన్లు ఎగరేస్తే ఏం వస్తుంది? అంటూ విమర్శిస్తున్నారు.