5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
5,300 ఏళ్ల క్రితం మంచులో గడ్డకట్టిపోయిన ఓట్జీ ఐస్‌మ్యాన్ శరీరంలో ఇప్పటికీ సూక్ష్మజీవులు జీవక్రియలు కొనసాగిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అతని కడుపులో ప్రాచీన బ్యాక్టీరియా, ఈస్ట్ జాతులు ఇంకా చురుగ్గా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ ఆవిష్కరణ మానవ ఆరోగ్య చరిత్రతో పాటు పురాతన సంపదల పరిరక్షణపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
సుమారు 5,300 ఏళ్ల క్రితం ఇటాలియన్ ఆల్ప్స్ పర్వతాల్లో బాణం దాడిలో హత్యకు గురైన ప్రాచీన మానవుడు ‘ఓట్జీ ఐస్‌మ్యాన్’ కథలో శాస్త్రవేత్తలు ఒక అబ్బురపరచే వాస్తవాన్ని కనుగొన్నారు. వేల ఏళ్లుగా అతని శరీరం మంచులో పడి గడ్డకట్టుకుపోయినా.. అతని శరీరంలోని సూక్ష్మజీవుల ప్రపంచం మాత్రం ఇంకా సజీవంగా, చురుగ్గా పనిచేస్తోందని పరిశోధకులు గుర్తించారు. యూరప్‌లోనే అత్యంత ప్రసిద్ధమైన ఈ మమ్మీ కడుపులో ప్రాచీన బ్యాక్టీరియా, చలిని తట్టుకునే ఈస్ట్ జాతులు ఇప్పటికీ జీవక్రియలను కొనసాగిస్తున్నాయని ‘మైక్రోబయోమ్’ జర్నల్ తాజా అధ్యయనంలో వెల్లడించింది. మంచు నదులు ఘనీభవించడంతో 5300 ఏళ్ల క్రితం ఓట్జీ చనిపోయాడు. మంచులోనే వేల ఏళ్ల పాటు భద్రంగా ఉన్న అతని దేహం 1991లో ఆస్ట్రియా- ఇటలీ సరిహద్దులోని ఓట్జ్‌టల్ ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో లభించింది. ఒట్జీ ఎడమ భుజంలో బాణం దిగబడి ఉండటం, ఇతర గాయాలు ఉండటం వల్ల ఎవరో ఆయనను హత్య చేసినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పలు పరిశోధనల ద్వారా ఆ మనిషి జీవితం, ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు అనేక విషయాలు కనుగొన్నారు. ఇటలీకి చెందిన యూరాక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రధాన పరిశోధకుడు మహమ్మద్ సర్హాన్ నేతృత్వంలోని బృందం ఓట్జీ చర్మం, కణజాలాలను విశ్లేషించి ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఓట్జీ చనిపోయే ముందు అడవి గొర్రె, ఎరుపు జింకల మాంసం, ముతక గోధుమలు, అడవి చెట్ల ఆకులు తిన్నాడని, అతని కడుపులోని బ్యాక్టీరియా ఇప్పటికీ జీర్ణం చేసే పనిలోనే నిమగ్నమై ఉంది. ఆధునిక పట్టణవాసుల్లో పూర్తిగా అంతరించిపోయి, ప్రస్తుతం కేవలం ఆఫ్రికా, అమెరికా మారుమూల గిరిజనుల్లో మాత్రమే ఉన్న ‘రోంబౌట్సియా హోమినిస్’ వంటి అరుదైన బ్యాక్టీరియా ఓట్జీ శరీరంలో నేటికీ సజీవంగా ఉంది. ఓట్జీ శరీరాన్ని మైనస్ 6 డిగ్రీల వద్ద భద్రపరిచేందుకు మ్యూజియం సిబ్బంది వాడే ‘ఫినాల్’ క్రిమిసంహారక రసాయనాలనే అక్కడి ఈస్ట్ జాతులు ఆహారంగా మార్చుకుని గత తొమ్మిదేళ్లుగా వృద్ధి చెందడం శాస్త్రవేత్తలను విస్మయానికి గురిచేసింది. ఈ ఆవిష్కరణ ఒకవైపు మానవ ఆరోగ్యం, వ్యాధుల పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుండగా.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియంల పరిరక్షణ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. గడ్డకట్టే చలిని, ఆధునిక రసాయనాలను తట్టుకుని ఈ సూక్ష్మజీవులు బతికేస్తుంటే, పురాతన సంపదను లోపలి నుంచే అవి నాశనం చేయకుండా ఎలా కాపాడాలనేది ఇప్పుడు పరిశోధకులకు పెద్ద సవాల్‌గా మారింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!
ప్రపంచంలోనే ఖరీదైన గ్రీన్ టీ.. కారణం ఇదే
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!

