Pulasa Fish: లేక లేక చిక్కిన పులస.. 2 కేజీల చేప ఎంత రేటు పలికిందో తెల్సా..?

| Edited By: Ram Naramaneni

Aug 23, 2023 | 9:30 AM

మాంసాహార ప్రియులకు.. పులస ఆల్‌ టైమ్ ఫేవరెట్. దీని రుచి గురించి గోదారోళ్లు ఎంతో గొప్పగా చెబుతారు. నదీ ప్రవాహానికి ఎదురీదడం ఈ చేప స్పెషాలిటీ. మార్కెట్‌లోకి పులస వస్తే చాలు వ్యాపారులు, జనాలు ఎగబడి మరీ కొంటారు. ఈ సీజన్లో రోజూ వేటకు వెళ్లే మత్స్యకారుల వలలకు ఒక్క పులస పడినా వారి పంట పండినట్టే. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసగా పిలుస్తే గోదావరి నదిలోకి వచ్చాకే పులసగా పిలుస్తారు. గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుందట..

పుదుచ్చేరి యానాంలో రెండు కిలోల పులస చేప 16 వేల రూపాయలు పలికింది. పుస్తెలు అమ్మెనా పులసచేప తినాలనేది గోదావరి జిల్లాల్లో ప్రజల నానుడి. పులసచేప ప్రియులు అమితంగా ఇష్టపడే చేప మత్స్యకారుల వలకు చిక్కింది. దానిని యానాం మార్కెట్‌లో మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనేందుకు పులస ప్రియులు ఎగబడ్డారు. వాస్తవానికి గోదావరిలో పులస చేప రాక ఈ ఏడాది బాగా తగ్గిపోయింది. నకిలీ పులస చేపల విక్రయం పెరిగింది. పులస చేప ధర ఎక్కువగా ఉండటంతో బాగా డబ్బులు ఉన్న అసాములకే తప్ప సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలింది పులస చేప.

Published on: Aug 23, 2023 09:28 AM