పాక్ ఏజెంట్ హనీ ట్రాప్‌లో భారత అధికారి
భారత్ నుంచి ఆర్మీ, రక్షణ రంగానికి చెందిన రహస్యాల కోసం దాయాది పాకిస్తాన్ అనేక ఎత్తుగడలు వేస్తూనే ఉంటుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ.. భారత్‌లోని పలువురికి మహిళలను ఎరగా వేసి.. వారి దగ్గరి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తూనే ఉంది. ఇప్పటివరకు ఎంతో మంది ఇలా దొరికిపోగా.. తాజాగా మరోసారి ఇలాంటి హనీ ట్రాప్ సంఘటన వెలుగులోకి వచ్చింది. పాక్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న ఓ అమ్మాయి వలపు వలలో పడిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి.. మిలిటరీ రహస్యాలను లీక్ చేయడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది.
ఆ వ్యక్తిని తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.కాన్పుర్ ఆయుధ కర్మాగార ఉద్యోగిని ఉత్తర్‌ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం అరెస్టు చేసింది. ఫ్యాక్టరీలో జూనియర్ వర్క్ మేనేజరుగా విధులు నిర్వహిస్తున్న కుమార్ వికాస్‌కు గత జనవరిలో పాక్ మహిళా ఏజెంటుతో ఫేస్‌బుక్ పరిచయం ఏర్పడింది. ఆమె తనను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఉద్యోగి నేహాశర్మగా పరిచయం చేసుకొంది. అనంతరం వికాస్‌కు డబ్బు ఆశ చూపడంతోపాటు వలపు వల విసిరింది. దీంతో అతడు లూడో గేమ్ యాప్‌ను ఉపయోగించి సంస్థకు చెందిన సున్నితమైన సమాచారం ఆమెకు చేరవేశాడు. ఈ సమాచారం లీకేజీతో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు అధికారులు అందోళన వ్యక్తం చేసారు. ఇదే పాక్ ఏజెంటు ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్ ఆయుధ కర్మాగార మెకానిక్ రవీంద్ర కుమార్‌పైనా ఇలాగే వలపు వల విసరడంతో పోలీసులు అతణ్ని అరెస్టు చేశారు.