Telangana Cold Wav: వచ్చే రెండు రోజులు అలర్ట్‌… చలి తీవ్రతపై ఐఎండీ వార్నింగ్‌

Updated on: Dec 15, 2025 | 9:37 PM

తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమురంభీం ఆసిఫాబాద్‌లోని సిర్పూర్‌లో 8.9°C నమోదైంది. పశ్చిమ గాలులు, తేమ తగ్గడం కారణం. వృద్ధులు, పిల్లలకు ముప్పు హెచ్చరికలు. రాబోయే 2 రోజులు చలి మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అంచనా. ప్రజలు వెచ్చని దుస్తులు, పానీయాలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తెలంగాణలో చలి గజ గజ వణికిస్తోంది. ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమురంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో చలి ప్రభావం అత్యధికంగా ఉంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యు)లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఈ ప్రాంతంలో శీతల గాలుల తీవ్రత కారణంగా.. వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి, ఆసిఫాబాద్‌ పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి గాలులు వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో గత కొన్ని వారాలుగా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ వారాంతంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు ఈ సీజన్‌లో అత్యంత కనిష్టంగా ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి వీచే శీతల గాలులు, వాతావరణంలో తేమ శాతం తగ్గడం దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలతో పాటు, ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో ఉష్ణోగ్రతలు 10.4 డిగ్రీల సెల్సియస్ నుంచి 10.9 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెల్లవారుజామున, రాత్రిపూట పనులకు వెళ్లే వారిని చలి తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. రానున్న రెండు రోజులు.. చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే ఏకంగా మూడు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. చలి తీవ్రత పెరిగే నేపథ్యంలో.. ప్రజలు వెచ్చని దుస్తులు ధరించడం, రాత్రిపూట ప్రయాణాలను తగ్గించడం, తాగునీరు, వేడి పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు విశేష స్పంద‌న‌

దూసుకెళ్తున్న ఎమ్మెల్యే కారు… ఆపిన పోలీసులు.. ఆ తర్వాత

విషాదం అంటే ఇదే… ఆ దాత నుంచి కిడ్నీ తీసుకున్న వారాలకే

‘దురంధర్‌’ పాటకు పాక్‌లో దుమ్మురేపేలా డాన్స్‌

తిరుమల శ్రీవారి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌