గదిలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం వీడియో
పర్యటనల్లో క్రికెటర్లతో పాటు వాళ్ల కుటుంబాలు ఉంటే మంచిదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నారు. మైదానంలో కష్టంగా గడిచిన రోజుల్లో ఒంటరిగా గదిలో ఇబ్బంది పడే బదులు కుటుంబ సభ్యులతో ఉండడానికి ఇష్టపడతానని చెప్పారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో 1-3 ఓటమి అనంతరం కుటుంబ సభ్యులతో భారత క్రికెటర్లు ఉండే సమయాన్ని బీసీసీఐ తగ్గించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 45 రోజులకు మించిన పర్యటనలో కుటుంబ సభ్యులు.. క్రికెటర్లతో రెండు వారాలకు మించి ఉండడానికి వీల్లేదు. చిన్న పర్యటనల్లో వారం వరకు ఉండొచ్చు.
ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా కోహ్లి, జడేజా, షమి కుటుంబ సభ్యులు వాళ్లతో ఉన్నారు. కానీ వాళ్లు జట్టు హోటల్లో లేరు. వాళ్ల ఖర్చులను క్రికెటర్లే భరించారు. కుటుంబ సభ్యుల పాత్ర ఎలాంటిదో జనాలకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం అని కోహ్లి అన్నారు. మైదానంలో తీవ్రంగా పోటీపడ్డ అనంతరం వాళ్లతో గడిపితే ప్రశాంతంగా ఉంటుందనీ దాని వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో జనానికి తెలుసని అనుకోననీ చెప్పారు. నా గదికి వెళ్లి ఒంటరిగా చిరాకుగా కూర్చుకోవాలనుకోననీ మూమూలుగా ఉండాలనుకుంటాననీ తెలిపారు. కుటుంబంతో ఉంటే అది సాధ్యమవుతుందనీ కుటుంబంతో ఉంటే సంతోషంగా ఉంటుందనీ వాళ్లతో ఉండడానికి వీలు కల్పించే చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టను అని కోహ్లి చెప్పారు. క్రికెటర్లకు సంబంధించిన ఈ విషయాలతో సంబంధం లేని వ్యక్తులు అనవసర చర్చలు చేయడం, కుటుంబాలు దూరంగా ఉండాలనడం నిరాశ కలిగిస్తోందని అన్నారు. ప్రతి క్రికెటరూ కుటుంబం దగ్గరగా ఉండాలని కోరుకుంటానని కోహ్లి చెప్పడం విశేషం.