ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు.. వివరాలు వెల్లడించిన మల్లు రవి
వైఎస్ మరణానికి సోనియా గాంధీ కారణమని ఆరోపించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైందని కాంగ్రెస్ పార్టీ నేత మల్లు రవి తెలిపారు. సోనియా గాంధీపై అసత్య ఆరోపణలు చేసినందుకు నారాయణస్వామిపై మొన్న తాను బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు.
వైఎస్ మరణానికి సోనియా గాంధీ కారణమని ఆరోపించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. సోనియా గాంధీపై అసత్య ఆరోపణలు చేసినందుకు నారాయణస్వామిపై మొన్న తాను బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. తన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు శనివారంనాడు పోలీసులు తనకు సమాచారం ఇచ్చినట్లు వెల్లడించారు. సోనియా గాంధీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే రామాలయ అంశాన్ని బీజేపీ రాజకీయం చేయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తామన్నారు. రామరాజ్యం రావాలని తొలుత పిలుపునిచ్చేంది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏలోనే రాముడి సందేశం ఉందన్నారు. ‘రఘుపతి రాఘవ రాజారామ్ పతీత పావన సీతారాం’ అని గాంధీ చెప్పిన విషయం గుర్తుచేస్తున్నామన్నారు. మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ నెల 22న ప్రతి ఇంట్లో గుర్తుచేసుకోవాలని పిలుపునిచ్చారు. రాముడి గుడికి రాజీవ్ హయాంలోనే ఫౌండేషన్ వేశామని.. కోర్టు కేసుల కారణంగా కట్టలేదని చెప్పారు.
పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని మల్లు రవి తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లను గెలుస్తుందని జోస్యం చెప్పారు.