Telangana: కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరవ్వనున్న రాజ్‌నాథ్ సింగ్
కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూనే.. మరోసారి మోదీ ప్రధాని ఎందుకు కావాలో ఓటర్లకు వివరిస్తున్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ గల్లీల్లో పర్యటిస్తూ బిజీగా ఉన్న కిషన్ రెడ్డి.. తనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు.
సొంత నియోజకవర్గం సికింద్రాబాద్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సనత్‌నగర్, అమీర్‌పేట్‌లో ప్రచారం నిర్వహించిన కిషన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ పథకాలు, గత పదేళ్లలో చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీలో వేసినట్టేనన్నారు. దేశాభివృద్ధి, రక్షణ మోదీతోనే సాధ్యమన్నారు.
ఈ నెల 19న సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తానన్నారు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరవుతారన్నారు. తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. ఏ సమస్యనైనా పరిష్కరించే శక్తి ప్రధాని మోదీకి ఉందన్నారు కిషన్ రెడ్డి. 500 ఏళ్ల తర్వాత ఒక యోధుడిలా రామమందిరాన్ని మోదీ నిర్మించారన్నారు. దేశ భవిష్యత్ కోసం మరోసారి మోదీని ప్రధానిని చేయాలన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని గల్లీ గల్లీలో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి.. కమలం గుర్తుపై ఓటు వేసి మోదీని, తనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…