Telangana: కమ్మవారి చుట్టూ మళ్లిన తెలంగాణ రాజకీయం.. లేటస్ట్ అప్‌డేట్స్
మొన్నటిదాకా బీఆర్‌ఎస్ వైపు చూసిన కమ్మ నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? ఇందులో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్‌లో కమ్మ కోటాలో వాటాల ఫైట్ నడుస్తోందా? ఎన్నికల వేళ.. ఢిల్లీ వేదికగా కమ్మగళం రీసౌండ్ చేస్తుండటం ఆసక్తి రేపుతోంది. అటు బీఆర్‌ఎస్ మాత్రం కమ్మ సామాజికవర్గం పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందంటూ కౌంటర్ ఎటాక్‌కి దిగడంతో.. రాజకీయం మరో మలుపు తిరిగింది.
తెలంగాణ కాంగ్రెస్‌లో నిన్నటిదాకా బీసీ జపం.. ఇప్పుడు కమ్మ రాజకీయం నడుస్తోంది. తమ సామాజిక వర్గ నేతలకు సీట్లు కేటాయించాలంటూ కమ్మ సామాజిక వర్గ ఆశావహులు ఢిల్లీ బాట పట్టారు. మాజీ ఎంపీ రేణుక చౌదరి ఆధ్వర్యంలో తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్య వేదిక నాయకులు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు. రాష్ట్రంలో తమ సామాజిక వర్గం ఓటర్లు 30 నుంచి 40 నియోజకవర్గాలలో ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఉందంటూ.. అందుకే తమకు సీట్లు కేటాయించాలంటూ వినతిపత్రం సమర్పించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
ఏపీ, తెలంగాణలో కమ్మ సామాజిక వర్గాన్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారని టీవీ9 బిగ్ డిబేట్‌లో ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. అందుకే ఎవరి దారి వారు చూసుకుంటున్నారని అన్నారాయన. టీవీ9 బిగ్ డిబేట్‌లో పాల్గొన్న బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్.. చంద్రబాబు అరెస్టు విషయంలో ఎలాంటి రాజకీయం లేదన్నారు. అలాగే కమ్మ వర్గం నేతలు రేవంత్ ట్రాప్‌లో పడొద్దని విజ్ఞప్తి చేశారు. తమ సామాజిక వర్గాన్ని దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు కమ్మ రాజకీయ ఐక్య వేదిక నేతలు.
మొత్తానికి కమ్మ గళం .. రెండు పార్టీల్లో సెగ పుట్టిస్తోంది. ఎవరికి వారే ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం కల్పిస్తున్నామని చెబుతున్నారు. మరి సీట్ల విషయంలో ఎలాంటి న్యాయం చేస్తారన్నది చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..