Telangana: కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలుంటాయి.. బీఆర్‌ఎస్‌కు ఉత్తమ్ వార్నింగ్

Telangana: కాగ్ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలుంటాయి.. బీఆర్‌ఎస్‌కు ఉత్తమ్ వార్నింగ్

Ram Naramaneni

|

Updated on: Feb 17, 2024 | 1:37 PM

డిజైన్‌, నిర్మాణ లోపాలు, ఓఅండ్‌ఎం పర్యవేక్షణ లోపం కారణంగా మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు మంత్రి ఉత్తమ్. 100 ఏళ్లు ఉండాల్సిన బ్యారేజీ.. కేవలం మూడేళ్లలోనే కుప్పకూలిపోయే స్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంగిపోయిన బ్యారేజీ, పియర్‌ 20 కింద నుంచి పైవరకు ఏర్పడిన పగుళ్లను ప్రజంటేషన్‌ ద్వారా మంత్రి వివరించారు.

తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ సహా ఇతర ప్రాజెక్టులపై ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సభ్యులు, రాష్ట్ర ప్రజలకు వివరించారు. అన్నారం బ్యారేజీలో శుక్రవారం నుంచి లీకులు మొదలయ్యాయని ఆరోపించారు మంత్రి ఉత్తమ్‌. ప్రాజెక్టు నిర్మాణం తర్వాత కనీసం ఇన్స్‌ఫెక్షన్‌ కూడా లేకుండా ప్రారంభించారని మండిపడ్డారు. అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అస్సలు నీరు నింపొద్దని NDSA రిపోర్టు ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. కాళేశ్వరం , దాని అనుసంధానంగా నిర్మించిన ప్రాజెక్టులో డిజైన్‌, నిర్మాణంలో లోపం ఉన్నట్లు విజిలెన్స్‌ రిపోర్టు బయటపెట్టిందన్నారు మంత్రి ఉత్తమ్‌. కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినా.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారన్నారు మంత్రి ఉత్తమ్‌. శ్రీశైలం జలాశయాలు ఏపీకి తరలించేలా అప్పటి సీఎం కేసీఆర్‌ సహకరించారని ఆరోపించారు. ఆర్డీఎస్‌పై గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అక్కడి రైతులకు సాగునీరు అందడంలేదన్నారు. కృష్ణాజలాలను ఏపీకి తాకట్టు పెట్టి దక్షిణ తెలంగాణకు అన్యాయం చేశారని విమర్శించారు.
మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీరు ఇచ్చి కాళేశ్వరం అని చెప్పారని వెల్లడించారు మంత్రి ఉత్తమ్‌. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఉపయోగం ఎంతో తెలియదు కానీ..ప్రతియేటా కరెంట్ బిల్లు మాత్రం 10వేల కోట్లు ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌ శాఖ ప్రాజెక్టుల కోసం 84వేల కోట్ల అప్పు తెచ్చారన్నారు మంత్రి ఉత్తమ్‌. ‘గత ప్రభుత్వం చేసిన ప్రతి రూపాయికి వచ్చే ప్రయోజనం 52 పైసలే.. కాంట్రాక్టర్లకు రూ.వేల కోట్లు లబ్ధి చేకూర్చినట్లు కాగ్‌ నివేదికలో చెప్పిందన్నారు మంత్రి ఉత్తమ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 17, 2024 01:36 PM