Telangana: బీఆర్ఎస్- గవర్నర్ తమిళిసై మధ్య పెరుగుతున్న గ్యాప్.. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలంటూ..
బీఆర్ఎస్, గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. రిపబ్లిక్ డే ప్రసంగంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్, గవర్నర్ తమిళిసై మధ్య గ్యాప్ మరింత పెరుగుతోంది. రిపబ్లిక్ డే ప్రసంగంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు మళ్లీ చిచ్చురేపాయి. గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఘాటుగా స్పందించింది. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్, జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలoగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తమిళిసై ఒక గవర్నర్ అని మర్చిపోయి గణతంత్ర దినోత్సవ వేదికను రాజకీయ వేదిక చేసుకొని మాట్లాడారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక తప్పులు జరిగాయని.. సరిగ్గా పని చేయలేదని మాట్లాడడం సరికాదన్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్న గవర్నర్ కూడా ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యురాలే అవుతారని అన్నారు. రాజ్యాంగం పట్ల అవగాహన లేని వారిని గవర్నర్ చేస్తే ఏ విదంగా ఉంటుందో నిదర్శనమే తమిళి సై అని విమర్శించారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానంలేని వారిని గవర్నర్ గా నియమించాకూడదన్నారు. గవర్నర్ వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నందునే గతంలో గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఎన్టీఆర్ డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు తనకు కూడా గవర్నర్ వ్యవస్థను రద్దు చేస్తే మంచిదని అనిపిస్తోందన్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఇంగితజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. చార్లెస్- శోభరాజ్, బిల్లా-రంగా అని బీఆర్ఎస్ వారిని విమర్శిస్తున్న రేవంత్ చరిత్ర, ఆయనపై ఉన్న కేసుల గురించి ప్రజలకు తెలియదా..? అని ద్వజమెత్తారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో నిరూపిస్తామని కడియం శ్రీహరి అన్నారు.
గవర్నర్ ఒక బీజేపీ నాయకురాలిలా మాట్లాడటం శోచనీయమని మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ద్వజమెత్తారు. గవర్నర్ వ్యాఖ్యలతో బీజేపీ – కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే అని తేలిపోయిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక బిల్లులను గవర్నర్ తొక్కిపట్టారని ఆరోపించారు. గవర్నర్ తన పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరి మాట్లాడితే మంచిదన్నారు.