Kurnool Bus Accident: శివశంకర్, ఎర్రిస్వామి మద్యం కొనుగోలు చేస్తున్న విజువల్స్ ఇవిగో

Updated on: Oct 26, 2025 | 2:55 PM

కర్నూలు జిల్లా, చిన్న టేకూరు వద్ద చోటు చేసుకున్న బస్సు యాక్సిడెంట్‌లో 19 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు.. బైక్‌ను ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు.

కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో భాగంగా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. బైక్ ప్రమాదానికి మద్యం మత్తే కారణమని తేలింది. ప్రమాదానికి ముందు బైక్‌ నడిపిన శివశంకర్‌ మద్యం సేవించినట్టు బయటపడింది. ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం 6.58 గంటల నుంచి రాత్రి 8.25 గంటల మధ్యలో శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరూ రెండు వేర్వేరు షాపుల్లో మద్యం కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆ దుకాణాల్లో సీసీ కెమెరా ఫుటేజీ కూడా లభ్యమైంది. విజువల్స్‌లో వారు బాటిల్స్ తీసుకుంటున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇంతకుముందే RFSL నివేదికలో శివశంకర్ రక్తంలో మద్యం ఆనవాళ్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆధారాలతో బైక్ ప్రమాదానికి ప్రధాన కారణం మద్యం మత్తేనని పోలీసులు తేల్చారు. ఇప్పటికే కేసులో కొన్ని కీలక సాక్ష్యాలు దొరకగా, మరికొన్ని ఆధారాలు సేకరించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కాగా బైక్ నడిపిన శివశంకర్‌తో పాటు ప్రయాణించిన ఎర్రిస్వామి.. మరణించిన శివశంకర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడిపై ఉలిందకొండ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Oct 26, 2025 02:54 PM