Andhra Pradesh: కాకినాడలో ఖతర్నాక్ గణపయ్య..1000 కిలోల చాక్లెట్లతో కొలువుదీరిన వినాయకుడు

Edited By: Krishna S

Updated on: Aug 27, 2025 | 10:07 AM

వివిధ రూపాల్లో ఉన్న గణపతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కాకినాడలో జెమ్స్ చాక్లెట్స్‌తో వినాయకుడిని తయారుచేశారు. 16 అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు 1000 కిలోల చాక్లెట్లను ఉపయోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ గణపయ్యను చూడడానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

కాకినాడ జిల్లాలో ఈ ఏడాది గణేశ్ చతుర్థికి విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణపతులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ తయారు చేసిన విగ్రహాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. కాకినాడ నగరంలో జెమ్స్ చాక్లెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 16 అడుగుల ఎత్తు ఉన్న ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి 1000 కిలోల చాక్లెట్లను ఉపయోగించారు. దీని తయారీకి దాదాపు రూ. 2 లక్షలు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చీరాల నుంచి వచ్చిన ప్రత్యేక కళాకారులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. చాక్లెట్ వినాయకుడిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

వేరుశనగ కాయలతో వినాయకుడు

కాకినాడలోని పెద్ద మార్కెట్‌లో మరో అద్భుతమైన విగ్రహం కొలువుదీరింది. 18 అడుగుల ఎత్తు ఉన్న ఈ వినాయకుడిని వేరుశనగ కాయలతో తయారు చేశారు. ఇందుకోసం 350 కేజీల వేరుశనగ కాయలను ఉపయోగించగా, తయారీకి రూ. 3.50 లక్షలు ఖర్చయింది. పర్యావరణహిత విగ్రహాలను తయారు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు, ప్రత్యేక బహుమతులు అందిస్తే బాగుంటుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. ఈ విగ్రహాలు పర్యావరణ పరిరక్షణకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయని, భక్తులు కూడా ఇలాంటి వినూత్న ప్రయత్నాలను అభినందిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Published on: Aug 27, 2025 08:46 AM