Khairatabad Ganesh Nimajjanam: మహా గణపతి నిమజ్జనం చూస్తే గూస్ బంప్స్ పక్కా..
ఖైరతాబాద్ మహా గణేష్ విగ్రహ నిమజ్జనం విజయవంతంగా పూర్తయింది. 69 అడుగుల గణనాథుడిని 11 రోజుల ఉత్సవాల తర్వాత గంగ ఒడికి చేర్చారు. 60 టన్నుల బరువుండే వినాయకుడిని ప్రత్యేక క్రేన్‌తో నిమజ్జనం చేశారు. ఇందుకోసం ఎన్టీఆర్ మార్గ్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నవరాత్రుల పూజలంతా ఒక ఎత్తు అయితే.. బడా గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం మరో ఎత్తు.
హైదరాబాద్ నగరానికే తలమానికమైన ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. లక్షలాది మంది భక్తులు గణపతి బప్పా మోరియా అంటూ చేసిన జయ జయ ధ్వానాల నడుమ హుస్సేన్ సాగర్‌లో విగ్రహ నిమజ్జనం అత్యంత వైభవంగా జరిగింది. అశేష భక్తజన పూజలందుకున్న గణనాథుడి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి.
శనివారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి కదిలిన గణనాథుడి శోభాయాత్ర, మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ వాహనాన్ని వినియోగించారు. దారి పొడవునా చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నీరాజనాలు పలికారు.
మహాగణపతిని కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు పూర్తిగా కిక్కిరిసిపోయాయి.
అనంతరం ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, భారీ క్రేన్ సాయంతో లంబోదరుణ్ణి నెమ్మదిగా హుస్సేన్ సాగర్‌లోకి నిమజ్జనం చేశారు. దీంతో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన పర్వం ప్రశాంతంగా ముగిసింది.
