త్వరలో కృష్ణ మెమోరియల్ నిర్మాణం(Video)

|

Nov 18, 2022 | 8:43 AM

హైదరాబాద్ ఫిల్మ్‌ కల్చరల్ క్లబ్‌లో కృష్ణ సంస్మరణ కార్యక్రమం జరిగింది. సినీనటులు, కృష్ణకు సన్నిహితులు, బంధువులు అంతా అక్కడ ఆయనకు నివాళి అర్పించారు.

హైదరాబాద్ ఫిల్మ్‌ కల్చరల్ క్లబ్‌లో కృష్ణ సంస్మరణ కార్యక్రమం జరిగింది. సినీనటులు, కృష్ణకు సన్నిహితులు, బంధువులు అంతా అక్కడ ఆయనకు నివాళి అర్పించారు. అక్కడే చిన్నకర్మనూ పూర్తిచేశారు మహేష్‌. సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరూ అన్నది భౌతికంగానే. ఇన్నాళ్ల సాన్నిహిత్యం రూపంలో అటు కుటుంబీకులకు, సినిమాల రూపంలో అభిమానులకూ ఎప్పుడూ కళ్లముందే ఉంటారు.. గుండెల్లో నిలిచిపోతారు. కృష్ణ పేరిట కేవలం సంస్మరణ నిర్వహించడం, నలుగురు.. నాలుగు జ్ఞాపకాలను నెమరవేసుకోవడం మాత్రమే కాదు.. ఇకపై భవిష్యత్ తరాలకూ ఆయన సుపరిచితం కావాలి. అలా కావాలన్నా, ఆయన జ్ఞాపకాలు కళ్లముందే ఉండాలన్నా దానికంటూ ఏదైనా చెయ్యాలీ అన్నది మహేష్‌బాబు ఆలోచన. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే కృష్ణ మెమోరియల్‌.

ఎక్కడ నిర్మించాలి, ఏ డిజైన్‌తో నిర్మించాలన్నదానిపై ఇంకా పుల్ క్లారిటీ అయితే రాలేదుగానీ.. ఎందుకు నిర్మించాలి, అందులో ఏమేం ఉండాలనేదానిపై మాత్రం మహేష్‌బాబుకు క్లారిటీ ఉంది. విశాల ప్రాంగణంలో నిర్మించబోయే ఆ మెమోరియల్‌లో కృష్ణ నటించిన 350 సినిమాల చెందిన గుర్తులు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో కనిపించిన ఆయన పోస్టర్లూ కనిపించబోతున్నాయి. కెరీర్‌లో ఆయన దక్కించుకున్న సత్కారాలు, అవార్డులూ కొలువుదీరబోతున్నాయి. వీటితోపాటు.. అభిమానులు, సందర్శకులు ఇలా వచ్చి చూసి, అలా వెళ్లిపోవడం కాకుండా.. కాసేపు సేదదీరేలా, మనసుకు హాయినిచ్చే ఓ ప్రాంతంగా మెమోరియల్‌ను తీర్చిదిద్దాలన్నది మహేష్‌బాబు ప్రయత్నం. దీనికి సంబంధించి ఇప్పటికే కుటుంబీకులు, సన్నిహితుల నుంచి సలహాలు, అభిప్రాయాలు కోరుతున్నారు మహేష్‌. రేపోమాపో అధికారికంగా ఓ ప్రకటనా వెలువడొచ్చు.

Published on: Nov 18, 2022 08:41 AM