వీధి కుక్కల ఆకలి తీర్చి.. సొంత ఖర్చుతో వ్యాక్సిన్లు వేయిస్తున్న ఒడిశా వాసి
వీధి కుక్కలను చూడగానే చాలామంది తరిమేస్తుంటారు. కొందరైతే రాళ్లతో దాడి కూడా చేస్తారు. కానీ, యతీంద్ర శర్మ కనిపించగానే.. ఎక్కడెక్కడి కుక్కలు పరిగెత్తుకుంటూ వెళ్లి మరీ స్వాగతం చెబుతాయి. ఆయన చేతి స్పర్శను అనుభూతి చెంది.. సంతోషంతో గంతులేస్తాయి. కారణం వాటిపై ఆయన చూపే ప్రేమ. ఒడిశాలోని సంబల్‌పుర్ కి చెందిన ఈ జంతు ప్రేమికుడు గత ఐదేళ్లుగా వాటికి అన్నం పెడుతూ వాటి ఆకలి తీరుస్తున్నారు.
తన కారులో వీధి కుక్కలను వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లి వ్యాక్సిన్లు వేయించటంతో బాటు నులిపురుగుల నివారణ మందులు వేయిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నారు. వీధి కుక్కల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ, వాటికి వైద్యులతో చికిత్స చేయిస్తున్నారు. యతీంద్ర శర్మ తన వీధిలోని 10 కుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయించారు. కుక్కలకు రేబిస్ టీకాలను కూడా వేయించారు. దీంతో సాహివాల్ వీధిలో కుక్కకాటు ఘటనలు సున్నాకు పడిపోయాయి. చాలావరకు కుక్కలు తినడానికి ఏమీ దొరకనప్పుడే మనుషులను కరుస్తుంటాయి. యతీంద్ర శర్మ చొరవ వల్ల వీధి కుక్కలకూ రోజూ ఆహారం, నీరు దొరుకుతున్నాయి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది స్థానికులు కుక్కలకు ఆహారాన్ని పెడుతున్నారు. వీధి కుక్కల దాడుల వల్ల ఢిల్లీలో రేబిస్ మరణాల సంఖ్య పెరగడంతో 8 వారాల్లోపు అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఆగస్టు 11న ఆదేశించింది. దీనిపై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. దాంతో రేబిస్ లక్షణాలు కనబరిచిన కుక్కల మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన మిగతా వాటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడినుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని ఆగస్టు 11న ఇచ్చిన తీర్పును సవరించింది. తన ఆదేశాల అమలుకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్రాలకు రెండు నెలల సమయం ఇచ్చింది. ఆగస్టులో ఇచ్చిన ఉత్తర్వుల తర్వాత కూడా వీధి కుక్కల దాడులు నమోదవుతుండటంతో సుప్రీంకోర్టు నుంచి సోమవారం తీవ్ర స్పందన వచ్చింది. వీధి కుక్కల కేసులో రాష్ట్ర ప్రభుత్వాలపై సోమవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది . కుక్కలను పట్టుకోవడం, వాటి సంతానోత్పత్తిని నిరోధించడం, వాటిని షెల్టర్లకు తరలించడంపై తీసుకుంటున్న చర్యలు తెలియచేసేలా అఫిడవిట్లు దాఖలు చేయకపోవడాన్ని ప్రశ్నించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొద్ది గంటల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం.. ఏం జరిగిందంటే..
నవంబరు 1 నుంచి మారనున్న ఆధార్ రూల్స్
కాలజ్ఞాన మహిమ.. నాలుగు కాళ్లతో పుట్టిన కోడిపుంజు
రజనీ-కమల్ కాంబోలో మూవీ పక్కా.. క్లారిటీ ఇచ్చిన సౌందర్య, శ్రుతి
