Saddula Bathukamma Celebrations: పంచుకుంటే తగ్గేవి బాధలు. పెరిగేవి అనుబందాలు ,ఆనందాలు . ఇలా బతుకు అర్ధం చెప్పే వేడుక, వేదికే బతుకమ్మ. బంధమే బలం. వెలుగుపూలే బలగం. తీరొక్క పువ్వులను కొలుస్తూ ప్రకృతితో మమేకయ్యే ఆనందాల లోగిలి..బతుకమ్మ. 8 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా పుష్పోత్సవం వెల్లి వెరిసింది. ఇవాళ 9వ రోజు సద్దుల బతుకమ్మ సందడి.. ఆనందంగా ఊయ్యాల పాటలు పాడుతూ..బతుకమ్మ ఆట ఆడుతూ భక్తిపూర్వకంగా గౌరవమ్మను నిమజ్జనం చేయడంతో ఈ వేడుక పరిసమాప్తి. పల్లె పల్లెన సద్దుల సందడితో తెలంగాణ పూదటగా విరాజిల్లుతోంది
ప్రతిఏటా అమావాస్యరోజు ఎంగిలిపూలతో ఆరంభమవుతాయి బతుకమ్మ వేడుకలు.. . పుట్టింటి గౌరవం..మెట్టినింటి ప్రతిష్ట వెరసి తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం ..బతుకమ్మ.
ఆడపడుచులంతా తమ కష్టాలను, ఇష్టాలను ఆటపాటలతో వ్యక్తికరిస్తారు. . 9 రోజుల సంబురంలో ప్రతీ రోజూ విశిష్టమైనదే. తీరొక్క పూలతో బతుకమ్మను చేయడమే కాదు..తీరొక్క ప్రసాదాలు సమర్పిస్తారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండవరోజు అటుకుల బతుకమ్మ, మూడవరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాల్గవరోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవరోజు అలిగిన బతుకమ్మ, ఏడవరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ.
సాంప్రదాయం ప్రకారం అమావాస్య రోజు 14వ తేదీన ఆరంభమైన బతుకమ్మ వేడుకలు నేడు సద్దుల బతుకమ్మతో పరిసమాప్తం అవుతున్నాయి. యావత్ తెలంగాణ వెలుగుపూల తోటలా ప్రకాశిస్తోంది.వెళ్లి రావమ్మా..మళ్లీ రావమ్మ అంటూ గౌరమ్మను గంగమ్మ ఒడికి తరలించారు .
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..