అర్ధరాత్రి సివిల్ డ్రెస్‌లో లేడీ సింగం.. వేధించిన 40 మంది పోకిరీలు.. కట్ చేస్తే..

Edited By:

Updated on: May 07, 2026 | 7:07 PM

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతను తెలుసుకునేందుకు ఐపీఎస్ సుమతి సాధారణ మహిళ వేషంలో అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి ఆమెను 40 మంది యువకులు వేధించారు. ఈ ఘటన నగరంలో మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారి తీసింది. పోకిరీలపై చర్యలు తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ హైదరాబాద్‌లో మహిళల రక్షణ అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది.

అర్ధరాత్రి రోడ్లపై ఓ ఆడపిల్ల ఒంటరిగా కనబడితే.. ఏమైనా హెల్ప్‌ కావాలా? అని రెస్పెక్ట్‌గా అడిగే మగాళ్లు ఈ సొసైటీలో ఎంత మంది ఉంటారు? అలాంటి బుద్ధిమంతులు ఎంత మంది ఉంటారో తెలియదుగాని.. ఎంతకొస్తావ్‌? ఎక్కడికెళ్దాం? అని అడిగే బ్యాచ్‌కు మాత్రం కొదవుండదు. కామన్‌ ఉమన్‌లా రోడ్డుపై నించున్న ఓ ఖాకీ సింగానికి ఎదురైన అనుభవం ఇదే చెబుతోంది. అయితే, ఆమె కామన్‌ లేడీ కాదు కాబట్టి..పోకిరీలను ఇస్త్రీ చేసి మడతెట్టేసింది. దీంతో హైదరాబాద్‌ నగరంలో మహిళల భద్రతపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. అర్ధరాత్రి వేళ దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో జరిగిన ఈ సీక్రెట్ పోలీస్ ఆపరేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సాధారణ మహిళలా వేషధారణలో వెళ్లిన మహిళా పోలీస్ కమిషనర్ ఐపీఎస్ సుమతి అనుభవించిన పరిస్థితులు చూసి అధికారులు కూడా షాక్ అయ్యారు. రాత్రి వేళ ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ కొందరు యువకులు ప్రవర్తించిన తీరు, నగర భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనతో హైదరాబాద్‌లో రాత్రి భద్రతపై మరోసారి ఫోకస్ పెరిగింది. భాగ్యనగరంలో మహిళల భద్రతపై పోలీసు శాఖ కీలక చర్యలు చేపడుతోంది. నగర మహిళా పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా ఫీల్డ్‌లోకి దిగి నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ సంచలనంగా మారింది. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మంగళవారం అర్ధరాత్రి ఈ ఆపరేషన్ చేపట్టారు. మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలిరోజే గ్రౌండ్‌ సిట్యుయేషన్‌పై ఫోకస్‌చేసిన సుమతి.. పోకిరీలకు ఊహించని షాక్‌ ఇచ్చారు. అర్ధరాత్రి ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. సంచలన ఆపరేషన్ నిర్వహించారు. ఇటీవల కాలంలో అరాచకాలకు అడ్డాగా మారిన దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్‌ను ఎంచుకున్నారు. అర్ధరాత్రి వేళ.. ఒంటరిగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా.. ఆ ఏరియాకు వెళ్లారు సుమతి. పోలీస్‌ కమిషనర్‌గా కాదు, సగటు మహిళగా రోడ్డుపై బస్సుకోసం ఎదురుచూస్తూ నిల్చున్నారు. అర్ధరాత్రి 12గంటల నుంచి మూడింటి వరకు… ఆమె అక్కడే ఉన్నారు. దాదాపు మూడు గంటలపాటు ఆమె అక్కడే ఉండి మహిళలు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. కమిషనర్‌గా సెక్యూరిటీ మధ్య కాదు.. కామన్‌ లేడీగా అర్ధరాత్రి రోడ్డెక్కితే.. పరిస్థితి ఎలా ఉంటుందో, కళ్లారా చూశారు. ఇప్పుడు మొదలైంది అక్కడ అసలు సినిమా. సుమతి ఎవరో తెలియక పోకిరీలు చుట్టు ముట్టేశారు. అందరూ కలిసి ఆ ఒంటరి మహిళను వస్తావా.. ఎంతివ్వాలి..ఎటు వెళ్దామంటూ ఆఫర్లమీద ఆఫర్లు ఇచ్చేసారు..అసలు ఇప్పటివరకూ ఆడముఖమే చూడనట్టుగా ఎగబడిపోయారు కొందరు. ఒకటి కాదు రెండు కాదు, దాదాపు మూడుగంటల పాటు.. దిల్‌ సుఖ్‌ నగర్‌ మెయిన్‌రోడ్డుపై ఇదే సీన్‌. అటువైపుగా ఒక్క పోలీస్‌ కూడా రాలేదు, పెట్రోలింగ్‌ వెహికిలూ రాలేదు. దీంతో, మరింత రెచ్చిపోయిన పోకిరీలు.. ఆమె వారి వద్ద నుంచి ముందుకు వెళ్తున్నా వినలేదు. బైకులు తీసుకొచ్చి ఆమె ముందే ఆపారు. వెకిలి చేష్టలతో విసుగు పుట్టించారు. ముఖ్యంగా, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతపై వరుస ఫిర్యాదులు రావడంతో కమిషనర్ సుమతి మూడు రోజుల పాటు స్వయంగా నిఘా పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో హాస్టల్స్ ఉండటంతో రాత్రి వేళల్లో యువకుల సంచారం ఎక్కువగా ఉంటోందని పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ హాస్టల్స్, విద్యార్థుల నివాసాలు ఎక్కువగా ఉండటంతో రాత్రి సమయంలో అల్లరి మూకలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో అనుమానాస్పదంగా తిరిగేవారిని గుర్తించడం, మహిళలను వేధించే యువకులపై నిఘా పెట్టడం, రాత్రివేళల్లో భద్రతా పరిస్థితులను పరిశీలించినట్లు తెలుస్తోంది. సీపీ సుమతిని చుట్టుముట్టిన పోకిరిల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. వాళ్లంతా మద్యం, గంజాయి మత్తులో ఉన్నారు. ఆ మైకంలోనే..అసభ్య ప్రశ్నలతో సుమతిని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అయినా ధైర్యంతో అక్కడే నిలబడి.. అందర్నీ గమనిస్తూ ఉండిపోయారు సుమతి. టైమ్‌ మూడున్నర అవుతోంది.. అప్పుడు అటువైపు ఓ బీట్‌ కానిస్టేబుల్‌ వచ్చాడు. అప్పటిదాకా ఆమె మృగాళ్ల మధ్య ఒంటరిగా ఉంది.. అప్పుడే ఆమె ఎవరో తెలిసింది. ఆ తర్వాత ఓ ఎస్సై వచ్చి సెల్యూట్‌ కొట్టగానే.. ఆమె లేడీ సింగం… విశ్వనగరపు తొలి మహిళా పోలీస్‌ కమిషనర్‌ ఐపీఎస్‌ సుమతి అని తెలిసిపోయింది. అది చూసి షాకవడం పోకిరీల వంతయ్యింది. అప్పటిదాకా.. పిచ్చిపిచ్చిగా కామెంట్స్‌ చేసిన ఆకతాయిలు.. పోలీస్‌ జీప్‌ ఎక్కాల్సి వచ్చింది. ఈ ఆపరేషన్‌లో కమిషనర్ సుమతిని సుమారు 40 మంది యువకులు ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. వాళ్లందరినీ అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగార్థులే ఉన్నట్టు గుర్తించారు. చుట్టూ ఉన్న హాస్టల్స్‌లో నివాసముంటున్న ఈ బ్యాచ్‌.. రాత్రయితే చాలు ఇలా రోడ్లమీద పడుతున్నట్టు గుర్తించిన సుమతి… మూడ్రోజులుగా ఈ ఏరియాపై స్పెషల్‌ ఫోకస్‌ చేశారు. అలాంటి బ్యాచ్‌కు ఇప్పుడు.. అదిరిపోయే షాకిచ్చారు. రోడ్డుపై ఆడపిల్ల కనిపించగానే చొంగ కార్చడం కాదు… చొరవ తీసుకుని వీలైతే సాయం చేయాలని సూచించారు. చదువు, కెరీర్‌ మీద ఫోకస్‌ చేయాలనీ బ్రెయిన్‌ వాష్‌ చేయడమే కాదు… మద్యం, గంజాయి అలవాట్లను వదులుకోకపోతే తోకలు కత్తిరిస్తానని హెచ్చరించి పంపించారు. అర్ధరాత్రి ఆడసింగం… హైదరాబాద్‌లో ఇప్పుడీ స్పెషల్‌ ఆపరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఇలాంటి సాహసాలు చేయడం సుమతికి కొత్తేం కాదు. 2001లో డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నాక… కాజీపేట రైల్వే స్టేషన్ దగ్గర కూడా… ఇలాగే నిలబడ్డారు సుమతి. ఆడది కనిపిస్తే అంగడి సరుకులా భావించే మగమృగాళ్లకు బుద్ధి చెప్పారు. సరిగ్గా పాతికేళ్ల తరువాత… మళ్లీ అలాగే… తనస్టయిల్‌లో పోకిరీలకు బుద్ధి చెప్పారు. కాకపోతే, ఈసారి అడ్డా దిల్‌సుఖ్‌నగర్ బస్టాప్‌కు మారింది. ఆవిడ ఐపీఎస్‌ సుమతి కాబట్టి… పక్కా వ్యూహంతో, ప్లానింగ్‌తో వెళ్లారు కాబట్టి … ఎలాంటి ప్రమాదమూ జరగలేదు. అదే నిజంగా ఒక కామన్‌ ఉమన్‌ ఆ ప్లేసులో ఉండిఉంటే… ఆ నలభై మంది మృగాళ్ల మధ్య.. పరిస్థితి ఏమయ్యేది. ఊహించడానికే భయానకంగా ఉంది కదా. అంటే.. ఇప్పటికీ హైదరాబాద్‌ నగరంలో అలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయనే దానికి.. ఈ లేటెస్ట్‌ పోలీస్‌ ఆపరేషన్‌.. అద్దం పడుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన రైలు..! రెప్పపాటులో ఇద్దరు వ్యక్తులు..

గ్యాస్‌ గోడౌన్‌లో చోరీ.. భారీగా సిలిండర్లు మాయం..

అరగుండు, చెప్పుల దండతో.. యువకుడి ఊరేగింపు.. కారణం ఇదే!

మెట్ గాలాలో ఇషా అంబానీ రాయల్ లుక్.. వజ్రాల బ్లౌజ్‌తో మెరిసిపోతూ..

Thalapathy Vijay: బక్కచిక్కిన కుర్రాడు టూ CM.. చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు

Follow Us