Telangana: నల్లగొండ జిల్లా పొలంలో ల్యాండ్ అయిన హెలికాప్టర్‌.. ఏంటా అని ఆరా తీయగా..

| Edited By: Ram Naramaneni

Sep 05, 2024 | 4:58 PM

నల్లగొండ జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్‌ అత్యవసరంగా ల్యాండ్‌ అవడం స్థానికంగా కలకలం రేపింది. విజయవాడలో వరద సహాయక, చర్యల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణ మైంది. ఈ సమయంలో...

నల్లగొండ జిల్లాలో ఆకాశంలో చక్కెర్లు కొడుతూ అత్యవసరంగా ల్యాండ్‌ కావడం కలకలం రేపింది. చిట్యాల మండలం వనిపాకలలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ల్యాండ్‌ అయింది. దీంతో స్థానికులు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. విజయవాడ వరద బాధితుల సహాయక చర్యల కోసం ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రితం జైపూర్ నుంచి కొన్ని ఆర్మీ హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతున్న విజయవాడ వాసులను రక్షించి వారికి సహాయక చర్యలను అందించిన హెలికాప్టర్లు తిరుగు ప్రయాణమయ్యాయి.

జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపంతో చిట్యాల మండలం వనిపాకలలోని వ్యవసాయ క్షేత్రంలో అత్యవసర ల్యాండ్ అయింది. కాగా, హెలికాప్టర్‌లో ఉన్న పైలట్‌తో సహా మరో ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత మరో హెలికాప్టర్‌లో సాంకేతిక సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపడుతున్నారు. ఒక్కసారిగా చక్కర్లు కొడుతూ హెలికాప్టర్ ల్యాండ్ కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..