పేరుకు ఫ్యాన్సీ వ్యాపారం.. కానీ లోపల బంగారం తాకట్టు దందా!

Edited By:

Updated on: Mar 31, 2026 | 5:09 PM

ప్రకాశం జిల్లా అద్దంకిలో అక్రమ బంగారం తాకట్టు దందా వెలుగు చూసింది... పేదల బంగారం తాకట్టుకని వడ్డీకి డబ్బులు ఇచ్చిన కిరాణా వ్యాపారి తమ నగలు మాయం చేసి బెదిరిస్తున్నాడంటూ ఆగ్రహంతో ఆందోళనకు దిగారు.. అక్రమంగా బంగారం తాకట్టు పెట్టుకుని వడ్డీవ్యాపారం చేస్తున్న కిరాణా షాపు యజమాని దుకాణం ముందు పేద మహిళలు ఆందోళనకు దిగడంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

అద్దంకిలో వెలుగు చూసిన అక్రమ గోల్డ్ ఫైనాన్స్ దందా.. కిరాణా షాపు ముసుగులో బంగారం తాకట్టు వ్యాపారం.. అసలు, వడ్డీ కడతామన్న నగలు ఇవ్వడం లేదని బాధితుల ఆందోళన చేపట్టారు. అధికార పార్టీ అండతో వ్యాపారి బంధువులు బెదిరింపులకు దిగనుండటంతో దిక్కుతో చని స్థితిలో ఆందోళనకు దిగారు బాధితులు.

ప్రకాశంజిల్లా అద్దంకి పట్టణంలో అక్రమ బంగారం తాకట్టు ఉదంతం కలకలం రేపుతోంది. కిరాణా కొట్టు ముసుగులో అమాయక ప్రజల బంగారాన్ని మింగేసేందుకు ఓ వ్యాపారి స్కెచ్ వేశాడు. పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ జనరల్ స్టోర్స్ యజమాని నూకల రామాంజనేయులు, నిబంధనలకు విరుద్ధంగా బంగారం, వెండి తాకట్టు వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఎటువంటి అనుమతులు లేకుండానే, కేవలం చిన్న స్లిప్పుల ఆధారంగా గుర్రాల కాలనీకి చెందిన పేద మహిళల వద్ద నుంచి నగలు తాకట్టు పెట్టుకుని వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు. గత కొంతకాలంగా సాఫీగానే సాగిన ఈ వ్యవహారం, ఇప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకడంతో ఒక్కసారిగా మలుపు తిరిగింది.

తమ అవసరాల కోసం తాకట్టు పెట్టిన నగలను తిరిగి ఇచ్చేయాలని గత రెండు నెలలుగా మహిళలు వ్యాపారి చుట్టూ తిరుగుతున్నారు. అసలు, వడ్డీ కడతామన్నా రామాంజనేయులు ససేమిరా అంటున్నాడు. పైగా, అతని అల్లుడు అధికార పార్టీ వ్యక్తి కావడంతో అ వ్యక్తి అండ చూసుకుని తమను బెదిరిస్తున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు షాపు ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. పసిపిల్లలతో సహా రోడ్డుపైకి వచ్చి తమ సొమ్ము తమకు ఇవ్వాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Published on: Mar 31, 2026 05:09 PM
Follow Us