Vetapalem: ఒరేయ్ ఎవర్రా మీరంతా..? ఇట్టా తయారయ్యారు ఏంట్రా బాబు..

|

Jun 03, 2023 | 3:30 PM

అయ్యప్పకుమార్‌కు చిన్నతనంలోనే తల్లి చనిపోతే అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు... కరోనా ముందు దాకా హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేసుకుంటున్న అయ్యప్ప తిరిగి తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉంటూ తనకు పెళ్ళి చేయాలని అమ్మమ్మను వేధించేవాడు.

Vetapalem: ఒరేయ్ ఎవర్రా మీరంతా..? ఇట్టా తయారయ్యారు ఏంట్రా బాబు..
Wanted Bride
Follow us on

నాకొక శ్రీమతి కావాలి… దానికి మీ అనుమతి కావాలి… మేనక అందం, ఊర్వశి నాట్యం లేకపోయినా ఫర్వాలేదు… నన్ను నన్నుగా ఇష్టపడితే చాలు… అలాంటి వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మా ఇంటికి రండంటూ ఓ కుర్రాడు ఊరంతా పోస్టర్లు అతికించాడు… తన ఇంటికి గోడలపై కూడా రాసుకున్నాడు… తన ఇంటికి వచ్చి ఇంటి ముందు గంట మోగించాలని చెబుతున్నాడు… అదికూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకే అంటూ సమయం కూడా సూచించాడు… ఇంటికి వచ్చిన వారు గంట మోగించి తనకు తెలపాలని కోరాడు… బాపట్ల జిల్లా వేటపాలెంలోని రామన్నపేటకు చెందిన 28 ఏళ్ళ అయ్యప్పకుమార్‌ వింత చేష్టలు స్థానికంగా కలకలం రేపాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అయ్యప్పకుమార్ కోసం గాలిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయ్యప్ప పరారీలో ఉన్నాడు.

వేటపాలెం మండలం రామన్న పేటకు చెందిన 28 ఏళ్ళ అయ్యప్ప కుమార్ పేరిట గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు, గోడలకు అంటించిన కరపత్రాలు హల్ చల్ చేస్తున్నాయి… ఇంతకీ ఆ కరపత్రంలో ఏముందంటే ” నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు , ఎటువంటి ఫోన్లు, యస్.ఎం.ఎస్ లు చేయాల్సిన అవసరం లేకుండా రామన్నపేటలోని నా ఇంటి అడ్రస్ కు నేరుగా వచ్చి నన్ను ధైర్యంగా కలవగలరు… అంతే కాదు మా ఇంటికి వచ్చే సమయంలో ఎవరినీ కలవవద్దు. నేరుగా నాతోనే వచ్చి మాట్లాడగలరు. అయితే ముఖ్య గమనిక… నా అడ్రస్ కు వచ్చే సమయంలో మీ ఫోటోలు తీసుకొని మీకు వీలు ఉన్న రోజుల్లోనే రాగలరు. మీరు వచ్చే సమయానికి నేను ఇంట్లో లేనట్లయితే మరల నన్ను ఎప్పుడైనా కలవవచ్చు. తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల లోగా నన్ను తప్పకుండా కలవగలరు ” అని అయ్యప్ప కుమార్ పేరిట ముద్రించిన పాంప్లెట్లు వేటపాలెంలోని అన్ని ప్రధాన సెంటర్లలో దర్శనమిచ్చాయి… ఈ పాంప్లెట్‌లో కోన్ని సూక్తులు కూడా రాసుకున్నాడు… ” నిలకడ లేని మనస్సును కల్గిన మనుషులు తమ గమ్యాన్ని చేరుకోలేరు… ఆశపడండి… దురాశ పడవద్దు… అంటూ కోటేషన్స్‌ రాశాడు… పైగా తన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరినీ కలవవద్దని ఇంటి ముందు ఏర్పాటు చేసిన గంటను మోగించాలని ఓ సత్తు గిన్నెను వేలాడదీశాడు… కాగా పాంప్లెట్‌, ఇతని చేష్టలు చూసిన జనం ఇదెక్కడి చోద్యమంటూ వ్యాఖ్యానిస్తున్నారు

అయ్యప్పకుమార్‌కు చిన్నతనంలోనే తల్లి చనిపోతే అమ్మమ్మ దగ్గర ఉంటున్నాడు… కరోనా ముందు దాకా హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేసుకుంటున్న అయ్యప్ప తిరిగి తన ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉంటూ తనకు పెళ్ళి చేయాలని అమ్మమ్మను వేధించేవాడు. పనీపాట లేనివాడికి పిల్లను ఎవరిస్తారని అమ్మమ్మ మందలించడంతో తనకు తానే పెళ్ళి చేసుకునేందుకు ఈ వింత పద్దతిని ఎంచుకున్నట్టు కనిపిస్తోంది… అయ్యప్ప వ్యవహారం వేటపాలెంలో చర్చనీయాంశంగా మారడంతో పోలీసులు విచారణ చేపట్టారు… అయ్యప్ప ఇంటికి చేరుకుని అతని అమ్మమ్మను విచారించారు… అయ్యప్పకు ఉద్యోగం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులకు గురవుతున్నాడని, మానిసిక స్థితి నిలకడగా లేని కారణంగా ఇలాంటి చేష్టలు చేస్తున్నాడని అయ్యప్ప అమ్మమ్మ వాపోతోంది.

ఫైరోజ్‌ బేగ్‌, ఒంగోలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..