
భర్త ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన చేపలను.. ప్రేమగా కూర చేసి పెట్టింది ఓ మహిళ. ఇద్దరూ భోజనం ముగించారు. అంతే! అసలేం జరుగుతోందో.. ఇద్దరికి అర్ధం కాలేదు. క్షణాల్లో అంతా తారుమారైంది. చివరికి భార్య చికిత్స పొందుతూ ప్రాణాలు విడిస్తే.. భర్త కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకోగా.. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందామా..
వివరాల్లోకి వెళ్తే.. జపాన్‌లోని జోహోర్‌కు చెందిన ఓ వ్యక్తి స్థానంగా ఉన్న మార్కెట్ నుంచి పఫర్ చేపలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు. తన భర్త ఎంతో ప్రేమగా చేపలు తీసుకురావడంతో.. ఆ ఇల్లాలు అతడికి ఇష్టమైన చేపల కూరను చేసి పెట్టింది. ఇద్దరూ కలిసి తిన్నారు. అంతే! సీన్ కట్ చేస్తే.. కొద్దిసేపటికే భార్యభర్తలిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సదరు మహిళకు ఒంట్లో వణుకు పుట్టడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. సరిగ్గా ఇవే లక్షణాలు ఆమె భర్తకు కూడా కొంత సమయానికి ప్రారంభమయ్యాయి.
అక్కడే ఉన్న వారి కుమారుడు ఇదంతా గమనించి.. తల్లిదండ్రులను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. ఇక చికిత్స పొందుతూ సదరు మహిళ మృతి చెందగా.. ఆమె భర్త కోమాలోకి వెళ్లిపోయాడు. పఫర్ ఫిష్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయి మృతి చెందినట్లుగా డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే కోమాలో ఉన్న తన తండ్రి ఎన్నో ఏళ్లుగా చేపల మార్కెట్‌లో పని చేస్తున్నాడని.. ఎప్పుడూ ఇలా జరగలేదని కుమార్తె పేర్కొంది. దీంతో ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టి.. దంపతులు తిన్న చేపల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా పఫర్ ఫిష్‌లో టెట్రోడోటాక్సిన్, సాక్సిటాక్సిన్ అనే ప్రాణాంతక విషపూరితాలు ఉంటాయని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఫ్రీజ్ చేసినా, వండినా.. ఈ విషపూరితాలు నాశనం కావని.. వాటి ఎలా తొలగించి.. వండాలో కేవలం శిక్షణ తీసుకున్న చెఫ్‌లకు మాత్రమే అనుమతి ఉందని పేర్కొంది.