ఆయుధ సంపత్తిలో సౌదీ తోపు.. అయినా హౌతీలను ఎందుకు అడ్డుకోలేకపోతోంది?
సౌదీ అరేబియా వద్ద భారీ సైనిక బలం, అత్యాధునిక ఆయుధాలు ఉన్నప్పటికీ.. హౌతీల దాడులను పూర్తిగా అడ్డుకోవడం కష్టంగా మారుతోంది. దీనికి దేశ విస్తీర్ణం, అనేక కీలక ప్రాంతాలకు ఏకకాలంలో రక్షణ కల్పించాల్సిన అవసరం, డ్రోన్లు-క్షిపణులను కలిపి ప్రయోగించే హౌతీల వ్యూహాలు, రక్షణ క్షిపణుల వినియోగంపై పెరుగుతున్న ఒత్తిడి వంటి అంశాలు కారణమవుతున్నాయి.

అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి. యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, భారీ సైనిక వ్యయం.. ఇలా ఎన్నో బలాలు ఆ దేశానికి ఉన్నాయి. అయినప్పటికీ, హౌతీ నుంచి ఎదురవుతున్న దాడులు సౌదీ రక్షణ వ్యవస్థకు సవాలుగా మారుతున్నాయి. ఇంతటి సైనిక శక్తి ఉన్నప్పటికీ హౌతీల మిస్సైళ్లను ఎందుకు అడ్డుకోవడం లేదు? అత్యాధునిక రక్షణ వ్యవస్థల్లో ఎక్కడ లోపాలు బయటపడుతున్నాయి?
2025లో సౌదీ అరేబియా తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో సుమారు 6.5 శాతాన్ని రక్షణ రంగం కోసం కేటాయించింది. ప్రపంచంలో అత్యధికంగా సైనిక రంగంపై ఖర్చు చేసే దేశాల్లో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తోంది.సౌదీ సైన్యంలో ఎఫ్-15 యుద్ధ విమానాలు, యూరోఫైటర్ టైఫూన్ విమానాలు, పేట్రియాట్, థాడ్ (THAAD) క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇటీవల టర్కీ, పాకిస్థాన్‌లతోనూ రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు చేసింది. అయితే, అధునాతన ఆయుధాలు ఉండటం ఒక్కటే సరిపోదని హౌతీల దాడులు నిరూపిస్తున్నాయి. శత్రువుల క్షిపణులు, డ్రోన్లను గుర్తించి అడ్డుకోవడం, దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాలకు నిరంతరం రక్షణ కల్పించడం సౌదీకి పెద్ద సవాలుగా మారింది.
హౌతీల చేతిలోనూ ప్రమాదకరమైన క్షిపణులు, డ్రోన్లు
యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు 2014లో రాజధాని సనాను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తమ ఆయుధ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్నారు. ఇరాన్ మద్దతు పొందుతున్న ఈ బృందం వద్ద వివిధ రకాల క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి. యెమెన్ నుంచి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్ వరకు తమ మిస్సైళ్ల సామర్థ్యాన్ని హౌతీలు ప్రదర్శించారు. సౌదీకి చెందిన విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు వంటి కీలక లక్ష్యాలను కూడా గురిపెట్టగలుగుతున్నారు.
హౌతీల వద్ద ఉన్న ఆయుధాల్లో పాలస్తీన్-2, తూఫాన్ వంటి మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. హైపర్‌సోనిక్ సామర్థ్యాలు ఉన్న పాలస్తీన్-2 క్షిపణి, ఇరాన్‌కు చెందిన ఘదర్ క్షిపణి తరహా తూఫాన్ క్షిపణి, బుర్కాన్, బదర్ వంటి స్వల్పశ్రేణి క్షిపణులు కూడా వారి ఆయుధ సంపత్తిలో ఉన్నాయి. అంతేకాదు.. ఒకేసారి వివిధ వేగాలతో ప్రయాణించే క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించడం ద్వారా ప్రత్యర్థి రక్షణ వ్యవస్థలను గందరగోళానికి గురిచేసే వ్యూహాన్ని హౌతీలు అనుసరిస్తున్నారు.
సౌదీ రక్షణ వ్యవస్థలో అసలు సమస్య ఏమిటి?
సౌదీ అరేబియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో దేశ విస్తీర్ణం ఒకటి. సుమారు 22 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ దేశంలోని ప్రతి ప్రాంతానికి నిరంతరం రక్షణ కల్పించడం అంత సులభం కాదు. సౌదీ రక్షణ వ్యవస్థ కొన్ని క్షిపణులు, డ్రోన్లను అడ్డుకోగలుగుతున్నప్పటికీ, దేశం విస్తీర్ణం కారణంగా ప్రతి దాడిని నిరంతరం అడ్డుకోవడం కష్టమవుతోంది. రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా విస్తీర్ణంలో ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయాల్లో ఒకటి. సుమారు 225 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది విమానాశ్రయం. దేశం మొత్తానికి చొరబడలేని రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రియాద్ నగరం, విమానాశ్రయాలు, చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను ఒకేసారి రక్షించాల్సి రావడం సౌదీకి భారంగా మారుతోంది.
పదే పదే దాడులు.. తగ్గిపోతున్న రక్షణ సామర్థ్యం?
హౌతీలు తరచూ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తుండటంతో సౌదీ రక్షణ వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రతి దాడిని అడ్డుకోవడానికి ప్రయోగించే ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు అడుగంటుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రక్షణ క్షిపణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వాటి లభ్యతపై ఆందోళనలు ఉన్నాయి. సౌదీ కొన్ని దాడులను విజయవంతంగా అడ్డుకుంటున్నప్పటికీ, మరికొన్ని దాడులు కీలక ప్రాంతాలకు చేరుతున్నాయి. చమురు కేంద్రాలు, రియాద్ విమానాశ్రయం లక్ష్యంగా జరిగిన దాడులు ఈ సమస్యను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.పదే పదే దాడులు చేసే సామర్థ్యం తమకు ఉందని చూపించడం ద్వారా సౌదీపై ఒత్తిడి పెంచడమే హౌతీల వ్యూహంలో భాగం.
హౌతీలు దాడులను ఎందుకు తీవ్రతరం చేస్తున్నారు?
యెమెన్‌లో చాలా కాలంగా కొనసాగుతున్న అంతర్యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చడం తాజా ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యెమెన్ ప్రభుత్వానికి సౌదీ మద్దతు ఇస్తుండగా, హౌతీలు దేశంలోని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇటీవల ఎర్ర సముద్ర తీర ప్రాంతంలో వ్యూహాత్మకంగా కీలకమైన భూభాగాలను హౌతీలు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సౌదీ సైనిక చర్యలను పెంచింది. హౌతీల ఆధీనంలోని సనా విమానాశ్రయంపై సౌదీ దాడులు చేయగా, దానికి ప్రతిగా సౌదీ కీలక మౌలిక సదుపాయాలను హౌతీలు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
హౌతీ ఉద్యమాన్ని అన్సార్ అల్లా అని కూడా పిలుస్తారు. ఈ బృందంలో వేలాది మంది శిక్షణ పొందిన, యుద్ధ అనుభవం కలిగిన సాయుధులు ఉన్నారు. యెమెన్‌లోని పర్వత ప్రాంతాల్లో పోరాడిన అనుభవం వారికి ఉంది. హౌతీలు సౌదీపై దాడులు చేయడం ద్వారా యెమెన్ యుద్ధంలో తమకు వ్యతిరేకంగా జరుగుతున్న సైనిక చర్యలకు ప్రతిస్పందించడమే కాకుండా, తమను ఎదుర్కోవడానికి సౌదీ చెల్లించాల్సిన మూల్యాన్ని పెంచాలని చూస్తున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సౌదీకి సైనిక నష్టం కంటే ఆర్థిక నష్టమే ఎక్కువా?
హౌతీల దాడులు సౌదీ సైనిక సామర్థ్యాన్నే కాకుండా, దేశ భద్రతపై ప్రపంచానికి ఉన్న అభిప్రాయాన్ని కూడా ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రియాద్ విమానాశ్రయం వంటి కీలక ప్రాంతాలపై దాడులు పర్యాటకం, అంతర్జాతీయ వ్యాపారం, పెట్టుబడులపై ప్రభావం చూపుతుంది.
సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో అమలు చేస్తున్న విజన్ 2030 ప్రణాళిక లక్ష్యం దేశ ఆర్థిక వ్యవస్థను చమురు ఆదాయంపై ఆధారపడకుండా విస్తరించడం. రియాద్‌ను అంతర్జాతీయ పర్యాటక, వ్యాపార, వినోద కేంద్రంగా తీర్చిదిద్దడం కూడా ఇందులో భాగమే. ఈ లక్ష్యాలను సాధించాలంటే సౌదీ అరేబియా సురక్షితమైన దేశంగా అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడిదారులు, పర్యాటకులకు నమ్మకాన్ని కలిగించాలి. కానీ విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై వరుస దాడులు ఆ నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. విమానాశ్రయంపై దాడి వల్ల కలిగే ప్రత్యక్ష నష్టంతో పోలిస్తే.. విమాన సర్వీసులకు అంతరాయం, ప్రయాణికుల్లో భయం, వ్యాపార సంస్థల్లో ఆందోళన, పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గడం ఎక్కువ కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.