అమ్మాయిలు తమ అందానికి మెరుగులు దిద్దుకోవడానికి స్లిమ్ గా, వైట్ గా మారేందుకు చాలా కసరత్తులు చేస్తుంటారు. అబ్బాయిలు కూడా తమకు కాబోయే భార్య అందంగా, స్లిమ్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ ఒక్క దేశంలో లావుగా ఉన్న అమ్మాయిలను అదృష్టవంతులుగా భావిస్తారు. అంతే కాదు అమ్మాయిలను లావుగా మార్చేందుకు బలవంతంగా ఆహారం కూడా తినిపిస్తున్నారు. ఉత్తర పశ్చిమ ఆఫ్రికా దేశమైన మౌరిటానియా అత్యంత వెనుకబడిన ఎడారి దేశం. ఇక్కడ ఉండే ప్రజలు లావుగా ఉండే అమ్మాయిలను ఇష్టపడతారు. మౌరిటానియా పురాతన ఆచారాల ప్రకారం.. ఈ దేశంలో లావుగా ఉండే ఆడపిల్లలు.. గొప్ప సంపద, కుటుంబ ప్రతిష్టకు చిహ్నంగా పరిగణించబడుతున్నారు. ఈ కారణంగానే ఈ దేశంలో కుటుంబాలు ఆడపిల్లలకు చిన్నప్పటి నుండే ఎక్కువగా తినేలా శిక్షణ ఇస్తున్నాయి.
మౌరిటానియాలో ఈ సంప్రదాయాన్ని లాబ్లౌ అంటారు. అమ్మాయిలకు చిన్న తనం నుంచి బరువు పెరగడానికి ప్రత్యేక ఆహారాన్ని ఇస్తారు. ముఖ్యంగా అధిక కేలరీలు కలిగిన పాలు, వెన్న వంటి ఆహార పదార్ధాలను చిన్నతనం నుంచి అమ్మాయిలకు ఇస్తారు. ఆడపిల్లకి తినాలని కూడా అనిపించకపోతే బలవంతంగా తినిపిస్తారు. ఇది ఈ దేశంలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం. లావుగా ఉన్న వధువు కుటుంబ ప్రతిష్టను పెంచుతుందని.. ఇంటికి ఆర్థిక శ్రేయస్సును తెస్తుందని అక్కడి ప్రజలు నమ్ముతారు.
మనదేశంలో అమ్మాయిలు బరువు తగ్గడానికి సన్నంగా అవ్వడానికి స్లిమ్ సెంటర్లలో చేరినట్లే.. మారిటానియా దేశంలో లావు అవ్వడానికి, బరువు పెరగడానికి ‘ఫాటెనింగ్ ఫార్మ్స్’ లో జాయిన్ అవుతారు. ఇలా లావు పెంచే సెంటర్లు ఆ దేశంలో అడుగడుగునా అక్కడ దర్శనమిస్తుంటాయి. ఐదేళ్ళు వయసు వచ్చిన ఆడపిల్లను తల్లిదండ్రులు ఈ ఫార్మ్స్‌లో జాయిన్ చేస్తారు. బరువు పెంచేవారిని ‘ఫాటెనర్లు’ అంటారు. మౌరిటానియాలో చాలా మంది ఇప్పటికీ ఆడపిల్లలను లావుగా మార్చే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే అక్కడ ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఆధునికత దృష్ట్యా కొన్నింటిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఊబకాయం ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. దీంతో కొన్ని చోట్ల ఈ సంప్రదాయం తగ్గిపోతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..