సాధారణంగా జూ కెళ్లిన సందర్శకులు అక్కడ ఉండే అన్ని రకాల జంతువులు, పక్షులను ఆసక్తిగా చూస్తారు. జంతువులతో ఫొటోలు దిగేందుకు ఉవ్విళ్లూరుతారు. అయితే ఇందుకోసం కొందరు జంతువుల ముందు అతిగా ప్రవర్తిస్తుంటారు. బోన్లు, ఎన్‌క్లోజర్లలో ఉండే జంతువులు మనల్ని ఏం చేయలేవన్న అహంకారంతో వాటితో ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. ఫలితంగా అనవసర కష్టాలను కొనితెచ్చుకుంటుంటారు. ఈక్రమంలో ఓ యువతి కూడా జూకు వెళ్లింది. అక్కడి కోతుల ఎన్‌క్లోజర్ దగ్గరకు వెళ్లి వాటి ఫొటోలు తీసింది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే ఆతర్వాత మొబైల్ లో ఫొటోలు చూస్తూ ఒక చేతితో ఆ ఎన్‌క్లోజర్‌ను పలుమార్లు గట్టిగా కొట్టింది.
జుట్టు పట్టుకుని లాగి..
దీంతో అక్కడున్న స్పైడర్ కోతికి బాగా కోపం తెచ్చింది. వెంటనే ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని గట్టిగా లాగేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ యువతి గట్టిగా కేకలు వేసింది. ఇది గమనించిన సమీపంలోని ఓ వ్యక్తి కోతి బారి నుంచి ఆమెను కాపాడాడు. మొదట చేతితో కొతిని కొట్టి తరిమేందుకు ప్రయత్నించాడు. అయినా అది అమ్మాయి జుట్టును వదల్లేదు. దీంతో అతను తన టీ షర్ట్ విప్పి కోతిని తరిమాడు. దీంతో ఎట్టకేలకు ఆ అమ్మాయి జట్టును వదిలేసింది కోతి. అయితే అక్కడితో ఆగకుండా అక్కడి నుంచి వెళ్లేక్రమంలో మరోసారి ఎన్‌క్లోజర్‌కు దగ్గరగా వెళ్లింది ఆ అమ్మాయి. ఈసారి రెండు కోతులు ఆమె జట్టు పట్టుకున్నాయి. అయితే ఆ అమ్మాయి వెంటనే రియాక్టయ్యి వాటి బారి నుంచి తప్పించుకుంది. అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ తతంగాన్ని తన మొబైల్ ఫోన్‌లో దీనిని రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈక్రమంలో అమ్మాయి ఎన్‌క్లోజర్‌కు సమీపంగా వెళ్లడం వల్లే ఇదంతా జరిగిందంటూ తప్పుపడుతూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో అన్నది మాత్రం తెలియరాలేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..