Viral Video: అర్థరాత్రి రైలు పట్టాలపై అసాధారణ శబ్ధాలు..! ఉలిక్కి పడ్డ సిబ్బంది..ఏం జరిగిందంటే..?

అర్ధరాత్రి రైల్వే ట్రాక్ నుండి అసాధారణ శబ్ధాలు రావడం వినిపించింది. అది విన్న రైల్వే సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు.. ఏం జరిగిందోనని పట్టాల వెంట పరుగులు తీస్తూ ఆ రూట్‌ అంతా చెక్‌ చేశారు.. చివరకు ఆ చీకట్లో వారికి షాకింగ్‌ సీన్‌ ఎదురుపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ చీకట్లో రైలు పట్టాలపై సిబ్బంది ఏం చూశారు.. ఆ వింత శబ్ధాలకు కారణం ఏంటి..? పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral Video: అర్థరాత్రి రైలు పట్టాలపై అసాధారణ శబ్ధాలు..! ఉలిక్కి పడ్డ సిబ్బంది..ఏం జరిగిందంటే..?
Dimapur Railway Tracks

Updated on: Dec 19, 2025 | 5:29 PM

నాగాలాండ్‌లోని దిమాపూర్ రైల్వే స్టేషన్ నుండి ఒక షాకింగ్ దృశ్యం బయటపడింది. పట్టాల వెంట డ్యూటీ చేస్తున్న రైల్వే సిబ్బందిని అర్థరాత్రి భారీ శబ్ధాలు కలవరపెట్టాయి. ఆ శబ్ధాలు ఏంటి..? ఎక్కడి నుంచి వస్తున్నాయని రైల్వే సిబ్బంది ఆరా తీశారు. పట్టాల వెంట పరిశీలస్తూ వెళ్లారు. చివరకు చీకట్లో వారు ఆ పట్టాలపై భారీ ఆకారాన్ని చూశారు. అది మహీంద్రా థార్ SUV. వాహనం రైలు పట్టాలపైకి దూసుకెళ్లింది. పట్టాలపై ఇరుక్కుపోయింది.. డిసెంబర్ 16 అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన జరిగింది. పాత బర్మా క్యాంప్ ఫ్లైఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్ నంబర్ వన్‌లో వాహనం చిక్కుకుంది. పట్టాలపై ఇరుక్కుపోయిన థార్ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడ్డాయి.

సమాచారం అందుకున్న దిమాపూర్ పోలీసులు, రైల్వే అధికారులు ఆ రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టాలపై ఇరుక్కుపోయిన థార్‌ను సురక్షితంగా తొలగించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే ఆస్తికి, ప్రయాణీకులకు ఎటువంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి దిమాపూర్ సిగ్నల్ అంగామికి చెందిన 65 ఏళ్ల టెఫునీటువోను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

నిర్లక్ష్యంగా వాహనం నడపడం, రైల్వే భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై కేసు నమోదు చేయబడింది. వాహనం డ్రైవర్ రైల్వే పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రాథమిక దర్యాప్తులో తీవ్రమైన నిర్లక్ష్యం, ట్రాఫిక్, రైల్వే నిబంధనల ఉల్లంఘనగా వెల్లడైందని PRO తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

అనుమతి లేకుండా రైల్వే ట్రాక్‌లోకి ప్రవేశించడం తీవ్రమైన నేరమని, మానవ ప్రాణాలకు, రైల్వే వ్యవస్థలకు పెను ముప్పు కలిగిస్తుందని అధికారులు గుర్తు చేశారు. ప్రభుత్వం అలాంటి డ్రైవర్ల లైసెన్స్‌లను రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది నెటిజన్లు డిమాండ్‌ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని భారీ జరిమానాలు విధించే అవకాశం ఉందని, ఇలాంటి సంఘటనలు తరచూగా జరుగుతూనే ఉంటాయని కూడా కొందరు గుర్తు చేశారు. మరొకరు వీడియోపై స్పందిస్తూ.. ట్రాక్‌పై డ్రైవింగ్ చేయడం సినిమాలా ఉంటుందని భావించాడో ఏమో.. ఎంత మూర్ఖుడు అంటూ ఘాటుగా స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..