పెన్షన్ కోసం సిబ్బంది మొండితనం.. 73 ఏళ్ల బామ్మను తోపుడు బండిపై బ్యాంకుకు తెచ్చిన మనవడు!

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో బ్యాంకింగ్ వ్యవస్థ, వృద్ధుల పట్ల ఉన్నతాధికారుల ఉదాసీనతను ఎత్తిచూపే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఒక 73 ఏళ్ల వృద్ధురాలిని, ఆమె మనవడు తీవ్రమైన మండుటెండలో తోపుడు బండిపై కూర్చోబెట్టి, గొడుగు పట్టి బ్యాంకుకు తీసుకువచ్చాడు.

పెన్షన్ కోసం సిబ్బంది మొండితనం.. 73 ఏళ్ల బామ్మను తోపుడు బండిపై బ్యాంకుకు తెచ్చిన మనవడు!
Grandson Takes Grandmother On Cart

Updated on: Jun 07, 2026 | 8:55 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో బ్యాంకింగ్ వ్యవస్థ, వృద్ధుల పట్ల ఉన్నతాధికారుల ఉదాసీనతను ఎత్తిచూపే ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నడవలేని స్థితిలో ఉన్న ఒక 73 ఏళ్ల వృద్ధురాలిని, ఆమె మనవడు తీవ్రమైన మండుటెండలో తోపుడు బండిపై కూర్చోబెట్టి, గొడుగు పట్టి బ్యాంకుకు తీసుకువచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బ్యాంకుల పనితీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫతేగఢ్‌లోని హతి ఖాన్ మొహల్లాకు చెందిన 73 ఏళ్ల కిషన్ ప్యారీ భర్త గతంలో విద్యుత్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆయన మరణానంతరం ఆమెకు ఫ్యామిలీ పెన్షన్ వస్తోంది. అయితే, ఇటీవల కిషన్ ప్యారీ తుంటి ఎముక విరగడంతో ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైంది. కనీసం నడవలేని స్థితిలో ఉన్న ఆమె, పెన్షన్ విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లడం అసాధ్యంగా మారింది.

గురువారం (జూన్ 04) తను బ్యాంకుకు వెళ్లి సిబ్బందిని కిషన్ ప్యారీ మనవడు మను పాల్ కలిశాడు. తన అమ్మమ్మ పరిస్థితిని వివరించి, ఆమె బ్యాంకుకు వచ్చే స్థితిలో లేనందున ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్ ఇచ్చేలా చూడాలని కోరాడు. అయితే, బ్యాంకు సిబ్బంది అతనితో దురుసుగా మాట్లాడటమే కాకుండా, పెన్షన్ కావాలంటే వృద్ధురాలిని ఖచ్చితంగా తీసుకురావాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక, మరుసటి రోజు (శుక్రవారం) మను పాల్ తన అమ్మమ్మను తోపుడు బండిపై ఎండ తగలకుండా గొడుగు పట్టి బ్యాంకుకు తీసుకువచ్చాడు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం.. 70 ఏళ్లు పైబడిన వృద్ధులు, అనారోగ్యం వల్ల బ్యాంకుకు రాలేని వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. అవసరమైతే బ్యాంకు సిబ్బందే స్వయంగా వారి ఇంటికి వెళ్లి దరఖాస్తులు, వేలిముద్రల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ వృద్ధురాలిని ఇలా తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వివాదంపై బ్యాంకు మేనేజర్ ప్రవేశ్ కుమార్ వర్మ వివరణ ఇస్తూ.. తాము వృద్ధురాలిని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని చెప్పారు. ఆమె కాలు విరిగిన విషయం తెలిసినప్పుడు, ఇంటికి బ్యాంకు ఉద్యోగిని పంపడానికి ఒకటి రెండు రోజులు సమయం పడుతుందని, అంతవరకు ఆగాలని కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలిపారు. ప్రతి నెలా ఇలాంటి 3-4 కేసులను తాము ఇంటి వద్దే పరిష్కరిస్తున్నామని మేనేజర్ సమర్థించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఘటన బ్యాంకింగ్ రంగంలో వృద్ధులకు ఎదురవుతున్న ఇబ్బందులకు అద్దం పడుతోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us