
డెన్మార్క్ సమీపంలో సముద్రం అడుగున 8,500 సంవత్సరాల నాటి మానవులు నివసించిన నగరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మంచు యుగం ముగిసినప్పుడు ఈ చిన్న నగరం నీటి అడుగున మునిగిపోయింది. భారీ మంచు పలకలు కరిగిపోయి.. సముద్ర మట్టాలు పెరిగి నగరాన్ని కప్పేశాయి.
డెన్మార్క్ తీరంలో నీటి అడుగున ఉన్న పరిశోధకులు చరిత్రపూర్వ స్థావరం అవశేషాలను కనుగొన్నారు, దీనిని “రాతి యుగం యూరప్ అట్లాంటిస్” అని పిలుస్తున్నారు. ఈ నగరం డెన్మార్క్‌లోని ఆర్హస్ బేలో కనుగొనబడింది. పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో తవ్వి, రాతి పనిముట్లు, బాణపు ముళ్ళు, జంతువుల ఎముకలు , ఒక సాధనంగా ఉండే చెక్క ముక్కను కనుగొన్నారు. ఈ పరిశోధనల ద్వారా ప్రజలు ఒకప్పుడు ఇక్కడ నివసించారని, వ్యవస్థీకృత జీవన విధానాలను కలిగి ఉన్నారని తెలియజేస్తున్నాయి.
పురావస్తు శాస్త్రవేత్త పీటర్ మో ఆస్ట్రప్ మాట్లాడుతూ ఈ ప్రదేశం “టైమ్ క్యాప్సూల్” లాంటిదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరం ఆక్సిజన్ లేకుండా సముద్రం కింద ఉంది. ఈ కారణంగా ఈ కళాఖండాలు నీటి అడుగున ఉన్నా..ఆక్సిజన్ అందకపోవడంతో.. భూమి మీద ఉన్న ఆవిష్కరణల కంటే చాలా బాగా సంరక్షించబడ్డాయని చెప్పారు. ఈ ప్రదేశం కోసం, “కాలం ఆగిపోయిందని చెప్పారు.
మధ్య శిలాయుగంలో ప్రజలు ఎలా జీవించారో చూపించే మరిన్ని ఆధారాలను సముద్రం దాచిపెట్టిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. తీరంలో మానవులు ఎలా జీవించారో తెలిపే చేపలు పట్టే పనిముట్లు, హార్పూన్లు, ఇతర వస్తువులను కూడా అన్వేషించాలని కోరుకుంటారు. ఈ ఆవిష్కరణలు చేస్తే అప్పటి ప్రజలు ఏమి తిన్నారో, వారు తయారు చేసిన సాధనాలు, వారి చుట్టూ ఉన్న ప్రపంచం మారుతున్నప్పుడు వారు ఎలా ఆ మార్పుకి అలవాటు పడ్డారో అర్థం చేసుకోవడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఆవిష్కరణ $15.5 మిలియన్ల విలువైన ఆరు సంవత్సరాల ప్రాజెక్ట్ వలన లభించింది. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా శాస్త్రవేత్తలు బాల్టిక్, ఉత్తర సముద్రాల అడుగుభాగాన్ని అన్వేషిస్తున్నారు. ఉత్తర ఐరోపాలో మునిగిపోయిన రాతి యుగం నాటి స్థావరాలను అన్వేషించడం ఈ మిషన్ లక్ష్యం.
ఈ వేసవిలో పరిశోధకులు ఆర్హస్ సమీపంలో సముద్రం కింద 26 అడుగుల లోతుకు వెళ్ళారు. సముద్రం అడుగున దాగున్న కళాఖండాలను సేకరించడానికి ఒక ప్రత్యేక నీటి అడుగున వాక్యూమ్‌ను ఉపయోగించారు. ఈ ప్రాంతంలోని ప్రతి భాగాన్ని జాగ్రత్తగా స్కాన్ చేశారు. అక్కడ నివసించిన ప్రజల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉత్తర సముద్రంలో మరో రెండు ప్రదేశాలను తవ్వాలని యోచిస్తున్నారు. అయితే ప్రస్తుతం సముద్ర పరిస్థితుల కారణంగా కష్టతరం అవుతుంది. ఈ పురాతన స్థావరాలను అధ్యయనం చేయడం ద్వారా.. పెరుగుతున్న సముద్ర మట్టాలు, మారుతూ ఉండే తీరప్రాంతాలకు అనుగుణంగా మనుషులు తమ జీవితాన్ని ఎలా అడ్జెస్ట్ చేసుకున్నారో తెలుసుకోవాలని పరిశోధకులు ఆశిస్తున్నారు. ఆ ఆవిష్కరణ నేడు ఏర్పడుతున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..