ప్రయాణీకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని RPF బలగాలు రాత్రింబవళ్ళు రైల్వే స్టేషన్ అంతటా గస్తీ కాస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ మధ్యకాలంలో రన్నింగ్ ట్రైన్‌లో కూడా ప్రతీ భోగిలోనూ తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను తమ అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. తాజాగా RPF బలగాలు ఏపీలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తోన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
రైల్వే స్టేషన్‌లో తనిఖీలు చేస్తోన్న RPF పోలీసులకు.. అప్పుడే స్టేషన్‌లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల కదలికలపై అనుమానం కలిగింది. ఆ ఇద్దరూ కంగారుగా చెన్నై ట్రైన్ ఎక్కడాన్ని గమనించారు. దీంతో సదరు ప్రయాణీకులను ఆపి.. లగేజ్‌ను చెక్ చేయగా.. పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. వారి ట్రావెల్ బ్యాగ్స్‌లో ఉన్న 38 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ. 8 వేల క్యాష్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, నిందితులు చెన్నైలోని గంజాయి రవాణా ముఠాకు చెందిన విశాల్‌కుమార్ సింగ్, నితీశ్‌కుమార్ పాండేలుగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.