గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి మళ్లీ టీఆర్‌ఎస్ ఖాతాలో చేయబోతుందా? తక్కువ సంఖ్యలో కార్పొరేటర్లను గెలుచుకున్నా.. బల్దియా పీఠాన్ని దక్కించుకుంటుందా? అంటే.. అదే నిజమంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీఆర్‌ఎస్ కేవలం 41 డివిజన్లలో గెలిచినా.. పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే మేయర్ పదవి గులాబీ దళానికే దక్కనున్నట్లు కనిపిస్తుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆ పార్టీకి ఉన్న ఎక్స్‌అఫీషియో ఓట్లే మేయర్ పీఠం దక్కేలా చేస్తాయని అంటున్నారు. అన్నీ సర్దుకుని ఎంఐఎం ఓట్లు కూడా కలిసి వస్తే.. అధికార పార్టీకి ఎదురే ఉండదని అంటున్నారు. అందుకే ఈసారి కూడా బల్దియాపై గులాబీ జెండాను ఎగురడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ధీమాతోనే టీఆర్‌ఎస్ నేతలు గ్రేటర్ ఎన్నికల రణరంగానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
2016లో గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరుగులేని అధిపత్యాన్ని సాధించింది. గులాబీ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో 99 మంది కార్పొరేటర్లు విజయం సాధించారు. ఇతర పార్టీల నుంచి మరో ముగ్గురు కారెక్కారు. దీంతో టీఆర్‌ఎస్ బలం 102 కు చేరింది. ఈసారి కూడా సెంచరీ కొడతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అంచనా మేరకు సీట్లు గెలవకపోయినా, ఊహించని పరిణామాలు ఎదురైనా.. ఎక్స్‌అఫీషియో ఓట్లతోనైనా మేయర్ పదవిని వశమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలోని టీఆర్‌ఎ్‌సకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ, శాసన మండలి సభ్యులు జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడం ఆ పార్టీకి కలిసి వస్తోంది. వీరి సంఖ్య ఏకంగా 35 వరకు చేరింది. గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ఓటుపై కాస్త అనుమానాలు ఉన్నప్పటికీ కొత్తగా ముగ్గురు ఎమ్మెల్సీలు ఎన్నిక కావడం గులాబీ దళానికి కలిసొచ్చే అవకాశం. ఈ భరోసాతోనే అధికార టీఆర్ఎస్ పార్టీ బల్దియా ఎన్నికలకు సిద్ధమైనట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా.. మేయర్ పదవికి మేజిక్ ఫిగర్ 76 సీట్లు. అయితే, మేయర్ ఎన్నికలో ఎక్స్‌అఫీషియో సభ్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ లెక్కన ఇప్పటికే టీఆర్‌ఎ్‌సకు 35 ఎక్స్‌అఫీషియో ఓట్లు ఉంటున్నాయి. వీటికి అదనంగా మరో 41 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిస్తే మేజిక్ ఫిగర్ 76కు చేరుకుంటుంది. దీంతో మేయర్ పీఠం అవళీలగా గెలుపొంది, బల్దియాపై గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయం. ఇక, ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం కూడా కలిసి వస్తే… గెలుపు నల్లేరుపై నడకే కానుంది.
మరోవైపు, ఎంఐఎం పార్టీకి కూడా జీహెచ్‌ఎంసీలో 10 ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయి. వీరు కూడా మేయర్ ఎన్నికలో టీఆర్‌ఎ్‌సకు మద్దతిస్తే.. ఎక్స్‌అఫిషియో ఓట్ల సంఖ్య 45కు చేరుతుంది. దీంతో టీఆర్‌ఎస్ 31 డివిజన్లలో గెలుపొందిన మేయర్ పీఠం అధికార టీఆర్ఎస్ పార్టీకే దక్కనుంది. 2016 ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న పార్టీకి… ఈ ఎన్నికల్లో 31 సీట్లు గెలుచుకోవడం పెద్ద కష్టం కాదని టీఆర్‌ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంటే.. పార్టీ ఖాతాలో మేయర్ పదవి ఉన్నట్లేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
టీఆర్‌ఎస్ పార్టీకి మరో మూడు ఎక్స్‌అఫీషియో ఓట్లు పెరిగే అవకాశాలున్నాయి. ఇటీవల గవర్నర్ ముగ్గురు ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు. ప్రభుత్వ సిఫారసు మేరకు నామినేట్ అయినందున… వీరు ముగ్గురు కూడా టీఆర్‌ఎస్ ఖాతాలో ఉన్నట్లే. ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడంతో జీహెచ్‌ఎంసీలోనే ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకుంటున్నారు. దీంతో టీఆర్‌ఎస్-ఎంఐఎంతో కలిపి ప్రస్తుతమున్న 45 ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం 48కి చేరనుంది. అప్పుడు స్వతహాగా కేవలం 28 డివిజన్లలో గెలిచినా.. మేయర్ పదవి చేజిక్కినట్లే.
కాగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలంతా 2016 గ్రేటర్ ఎన్నికల సందర్భంగా జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. ఇందులో కొంత మంది.. నగర శివార్లలో కొత్తగా ఏర్పాటైన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. అయితే వీరి సంఖ్య చాలా స్పల్పమేనని అంటున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా సభ్యులకు లేఖలు రాసి స్పష్టత కోరింది. ఈ వివరాలు అందగానే టీఆర్‌ఎస్ ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య స్పష్టమవుతుంది.
టీఆర్‌ఎస్ తరపున మేయర్ పదవిని పలువురు ప్రముఖ నేతల బంధువులు ఆశిస్తున్నారు. వీరిలో ప్రధానంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోడలితోపాటు మాజీ హోంమంత్రి, దివంగత నాయిని నర్సింహారెడ్డి కూతురు, రాంనగర్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి సతీమణి మమతారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. వీరే కాకుండా.. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కూతురు విజయలక్ష్మి, మంత్రి మల్లారెడ్డి కూతురు, డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు కోడలు, పి.జనార్దన్‌రెడ్డి కూతురు విజయ, మేయర్ బొంతు రామ్మోహన్ భార్య, మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోడలు రేసులో ఉన్నారు.