వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. తాజాగా బీహార్‌లోని కైమూర్ జిల్లాలో కర్కట్ జలపాతంలో చిక్కుకున్న 11 మంది పర్యాటకులను ప్రాణాలకు తెగించి రక్షించారు NDRF టీం. జలపాతం అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకులు వరద ప్రవాహంలో చిక్కుకుపోయారు. అకస్మాత్తుగా భారీ వర్షం రావడం, అదే సమయంలో జలపాతంలో వరద ప్రవాహం పెరగడంతో పర్యాటకులు ఎటు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కొందరు చెట్లు ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రంతా గడిపారు. వారిని అతికష్టం మీద ప్రాణాలకు తెగించి NDRF సిబ్బంది కాపాడారు.
ఈ సంఘటన సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటికే చీకటి పడింది.. సమాచారం అందుకున్న వెంటనే కైమూర్ జిల్లా యంత్రాంగం చైన్‌పూర్ పోలీసులను, SDRF బృందాన్ని పంపింది. భారీ వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. యూపీ నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో రక్షించడం కష్టంగా మారింది. అనంతరం రాత్రి 1 గంటకు ఎన్‌డిఆర్‌ఎఫ్‌ని కూడా అక్కడికి పంపించారు.
ఈ వీడియో చూడండి..
నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది. ద్వీపం మధ్యలో ఉన్న యువకులను రక్షించడం కష్టంగా మారింది. కైమూర్ డీఎం సావన్ కుమార్, ఎస్పీ లలిత్ మోహన్ శర్మ, డీఎఫ్‌వో చంచల్ ప్రకాశం కూడా కర్కట్‌ఘర్ చేరుకున్నారు. విడుదల చేసిన నీటిని తగ్గించాలని జిల్లా యంత్రాంగం ఉత్తరప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని కోరింది. 40 మందితో కూడిన SDRF బృందం రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగించింది. సోమవారం ఉదయం అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో పర్యాటకులందరూ దాదాపు 16 గంటలపాటు వరద ఉధృతిలోనే బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో గడిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..