
అడవి అంటే జంతువుల రాజ్యం. అక్కడ అవి స్వేచ్ఛగా విహరించాలి. కానీ, మనిషి వినోదం కోసం అడవిలోకి చొరబడి వన్యప్రాణుల మనుగడకే ముప్పు తెస్తున్నాడా? అనే అనుమానం రాజస్థాన్‌లోని రణతంబోర్ నుండి వచ్చిన ఈ వైరల్ వీడియో చూస్తే కలుగుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక గంభీరమైన పులి అడవి బాటలో నడుస్తూ వస్తోంది. అయితే, ఆ పులిని చూడటానికి, ఫోటోలు తీయడానికి పర్యాటకులు డజన్ల కొద్దీ జీపుల్లో అక్కడ గుమిగూడారు. పులి వెళ్లే దారిని పూర్తిగా వాహనాలతో అడ్డుకోవడంతో, ఆ మూగజీవి వాహనాల మధ్య నుండి దారి వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో పర్యాటకులు చేస్తున్న అరుపులు, వాహనాల శబ్దాలు ఆ జంతువును తీవ్ర ఒత్తిడికి గురిచేసేలా ఉన్నాయి.
వీడియో వైరల్‌గా మారడంతో ఈ దృశ్యాలను చూసిన వన్యప్రాణి ప్రేమికులు అటవీ శాఖ అధికారులపై మండిపడుతున్నారు. ఇది అడవిలా లేదు, నగరంలోని ట్రాఫిక్ జామ్‌లా ఉంది అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పులులు తమ సహజ ఆవాసంలో స్వేచ్ఛగా ఉండనివ్వకుండా, వాటికి ఇంత దగ్గరగా వాహనాలను అనుమతించడం నిబంధనలకు విరుద్ధమని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి చర్యల వల్ల జంతువులు చిరాకు పడి పర్యాటకులపై దాడి చేసే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
పర్యాటకం ద్వారా ఆదాయం రావడం ముఖ్యం కావొచ్చు. కానీ, అది వన్యప్రాణుల ప్రాణాలకు లేదా వాటి ప్రశాంతతకు భంగం కలిగించేలా ఉండకూడదని మండిపడుతున్నారు.. సఫారీ సమయంలో వాహనాల మధ్య నిర్ణీత దూరం పాటించేలా, వాహనాల సంఖ్యను పరిమితం చేసేలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…