ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉందని ఓ ముగ్గురు వ్యక్తులు పక్కా స్కెచ్ వేశారు. ప్లాన్ ప్రకారం తాము కార్పోరేషన్ ఉద్యోగులమంటూ ఆమెకు చెప్పి.. ఇంట్లోకి ప్రవేశించారు. అంతా తాము అనుకున్నట్లే జరుగుతోందని ఊహించారు. కానీ కాసేపటికే వారి మైండ్ బ్లాంక్ అయ్యే పని చేసింది ఆ మహిళ.. ఇంతకీ అసలేం జరిగిందంటే..
వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని అదాజన్ ప్రాంతంలో ఉన్న సీకే విల్లా సొసైటీలో జిగ్యాసా తేజస్ అనే మహిళ ఒంటరిగా నివాసముంటోంది. ఈ క్రమంలోనే ఆమె ఇంటికి గురువారం ముగ్గురు వ్యక్తులు కార్పోరేషన్ ఉద్యోగులమంటూ వచ్చారు. మీ ఇంటి వాటర్ ట్యాంక్ తనిఖీ చేయాలి అని అడిగారు. ఆ ముగ్గురి వేషధారణ గవర్నమెంట్ అధికారుల లాగే ఉండటం సదరు మహిళ వారిని లోపలికి ఆహ్వానించింది. వాటర్ ట్యాంక్ చుట్టూ పరిసరాలు గమనిస్తుండగా.. ఆమెకు క్లోరోఫోమ్ ఇచ్చారు.
అయితే సదరు మహిళ ఎక్కడా కూడా కంగారు పడకుండా తెలివిగా మూర్చపోయినట్లు నటించింది. దీనితో దొంగలు ఆమెను అక్కడే వదిలేసి.. తమ పనిలో నిమగ్నమైపోయారు. అదును చూసుకున్న ఆమె చకచకా బయటికి పరుగులు తీసి.. ‘ఇంట్లో దొంగలు పడ్డారంటూ’ అరిచింది. దీనితో అప్రమత్తమైన ఆ ముగ్గురు.. అక్కడ నుంచి పరారయ్యారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.