గుండె, మెదడు లేకున్నా కోట్ల ఏళ్లుగా బతుకుతున్న జీవి.. ప్రకృతి దాచిన ఈ రహస్యం తెలిస్తే..
ఒక్క సెకను గుండె కొట్టుకోవడం ఆగితేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటిది అసలు శరీరంలో గుండె అనేదే లేకుండా ఏదైనా జీవి బతకగలదా? వినడానికి వింతగా అనిపించినా ఇది పచ్చి నిజం. గుండె మాత్రమే కాదు.. ఆలోచించడానికి మెదడు, నాళాల్లో ప్రవహించడానికి రక్తపు బొట్టు కూడా లేకుండా కోట్లాది ఏళ్లుగా సముద్రాలను ఏలుతున్న ఆ వింత ప్రాణి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సృష్టిలోని ప్రతి జీవి ప్రాణంతో ఉండాలంటే గుండె కొట్టుకోవాల్సిందే. రక్తాన్ని శరీర భాగాలకు పంపింగ్ చేస్తూ ప్రాణవాయువును అందించే ప్రధాన ఇంజిన్ గుండె. కానీ ఈ భూమిపై గుండె లేకపోయినా, కనీసం మెదడు, రక్త ప్రసరణ వ్యవస్థ లేకపోయినా దర్జాగా జీవించేస్తున్న ఒక వింత జీవి ఉంది. అదే జెల్లీఫిష్ . డైనోసార్ల కంటే ముందే పుట్టి, ఇప్పటికీ సముద్ర గర్భంలో రాజసంగా ఈదుతున్న ఈ అద్భుత జీవి జీవన రహస్యాలు తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. సాధారణంగా జీవుల శరీరంలో గుండె రక్తాన్ని సరఫరా చేస్తే, ఆ రక్తం ద్వారా కణాలకు ఆక్సిజన్ అందుతుంది. కానీ జెల్లీఫిష్ శరీర నిర్మాణమే ఒక వింత. జెల్లీఫిష్ శరీరంలో దాదాపు 95 శాతానికి పైగా నీరే ఉంటుంది. దీని బాహ్య చర్మం చాలా పలచగా ఉంటుంది. ఈ చర్మం ద్వారానే సముద్రపు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ను శరీరం నేరుగా గ్రహిస్తుంది. కణాలకు అవసరమైన ప్రాణవాయువు నేరుగా అందడం వల్ల దీనికి రక్తాన్ని పంప్ చేసే గుండె గానీ, రక్తనాళాలు గానీ అవసరం లేకుండా పోయాయి.
మెదడు కూడా లేదు.. మరి ఎలా కదులుతుంది?
మనుషులకు, ఇతర జంతువులకు ఆలోచించడానికి, కదలడానికి మెదడు ముఖ్యం. కానీ జెల్లీఫిష్కు అసలు మెదడే ఉండదు. దాని స్థానంలో శరీరమంతా ఒక వలలా అల్లుకున్న నాడీ వ్యవస్థ ఉంటుంది. వెలుతురు, నీటి ప్రవాహం, చుట్టూ ఉన్న ప్రమాదాలను ఈ నాడీ కణాలే పసిగడతాయి. శత్రువుల నుంచి తప్పించుకోవడం, ఆహారాన్ని వేటాడటం లాంటి పనులన్నీ ఈ సింపుల్ నాడీ వ్యవస్థ ఆధారంగానే ఆటోమేటిక్గా జరిగిపోతాయి.
డైనోసార్ల కంటే ముందే భూమిపైకి
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. జెల్లీఫిష్లు దాదాపు 50 నుంచి 60 కోట్ల సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. భూమిపై డైనోసార్లు రాకముందే ఇవి సముద్రాలలో జీవించాయి. అనేక యుగాలు మారినా, భారీ విలయాలు సంభవించినా గుండె, మెదడు లేని ఈ సరళమైన జీవి మాత్రం చెక్కుచెదరకుండా మనుగడ సాగిస్తూనే ఉంది.
అమరత్వాన్ని పొందిన టురిటోప్సిస్ డోర్ని
జెల్లీఫిష్ జాతుల్లో టురిటోప్సిస్ డోర్ని అనే రకం మరింత విచిత్రమైనది. దీనిని శాస్త్రవేత్తలు ఇమ్మోర్టల్ జెల్లీఫిష్ అని పిలుస్తారు. వయసు పైబడినప్పుడు లేదా గాయపడినప్పుడు ఇది మళ్లీ తన శైశవ దశకు మారిపోయి, సరికొత్తగా జీవితాన్ని రీస్టార్ట్ చేస్తుంది. అంటే దీనికి సహజ మరణమంటూ ఉండదు. అన్ని అవయవాలు పర్ఫెక్ట్గా ఉంటేనే బతకగలమనే జీవశాస్త్ర సూత్రాలను తలకిందులు చేస్తూ.. గుండె చప్పుడు లేకపోయినా కోట్లాది ఏళ్లుగా జీవన ప్రయాణం సాగిస్తున్న జెల్లీఫిష్, ప్రకృతిలోని లెక్కలేనన్ని వింతల్లో ఇదొక అద్భుతం.
