AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఓరుగల్లు గొంతు తడిపేందుకు గోదావరి జలాలు సిద్ధం.. ఎల్‌నినో ముప్పుతో అధికారుల మాస్టర్ ప్లాన్..

భానుడి భగభగలు.. ముంచుకొస్తున్న ఎల్ నినో ముప్పు.. రానున్న వేసవిలో ఓరుగల్లు గొంతు ఎండిపోకుండా అధికార యంత్రాంగం సరికొత్త అస్త్రం సిద్ధం చేసింది. ఎండకాలం రాకముందే చారిత్రక భద్రకాళి జలాశయంలోకి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దాహం కేకలు వినిపించకుండా మహానగరంలో మొదలైన ముందస్తు వాటర్ ప్లానింగ్‌కు సంబంధించి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Telangana: ఓరుగల్లు గొంతు తడిపేందుకు గోదావరి జలాలు సిద్ధం.. ఎల్‌నినో ముప్పుతో అధికారుల మాస్టర్ ప్లాన్..
Godavari Water Reaches Warangal
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 15, 2026 | 4:47 PM

Share

రానున్న వేసవిలో వరంగల్ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎల్ నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో కరవు పరిస్థితులు, తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా గోదావరి జలాలను ఓరుగల్లు నగరానికి తరలిస్తూ, వేసవి అవసరాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ నగరానికి ప్రస్తుతం ప్రధానంగా ధర్మసాగర్ రిజర్వాయర్ నుంచే తాగునీరు అందుతోంది. అక్కడి నుంచి నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, గతంలో తాగునీటి అవసరాలు తీర్చిన చారిత్రక భద్రకాళి చెరువును ఈసారి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా ఉపయోగించాలని అధికారులు నిర్ణయించారు. గత రెండేళ్లుగా పూడికతీత పనులు జరుగుతుండటంతో ఈ చెరువులోకి వర్షపు నీటిని కూడా చేరనీయకుండా దిగువకు వదిలేశారు. ప్రస్తుతం పనులు ఇంకా పూర్తిగా ముగియనప్పటికీ, ప్రజల తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా చెరువులోకి నీటిని విడుదల చేస్తున్నారు.

50 ఎంసీఎఫ్‌టీల మేర నీటి నిల్వ

దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్‌కు చేరుతున్న జలాలను.. అక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా భద్రకాళి చెరువులోకి మళ్లిస్తున్నారు. భద్రకాళి చెరువు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 150 ఎంసీఎఫ్‌టీలు కాగా, ప్రస్తుతానికి ముందస్తు రక్షణ చర్యగా 50 ఎంసీఎఫ్‌టీల మేర నీటిని నింపుతున్నారు. దీనివల్ల నగరంలో భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు తీవ్ర వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడితే వెంటనే ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునే వీలుంటుంది.

సాగు, తాగునీటికి సమతుల్యత

ధర్మసాగర్ రిజర్వాయర్ పరిధిలోని జనగామ జిల్లాలోని పలు మండలాల సాగు, తాగునీటి అవసరాలకు ఎలాంటి విఘాతం కలగకుండా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. అక్కడి రైతాంగానికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా దశలవారీగా నీటిని ఎత్తిపోస్తూ భద్రకాళి వైపు మళ్లిస్తున్నారు. రాబోయే వేసవి సంక్షోభాన్ని ముందే ఊహించి, ప్రణాళికాబద్ధంగా జలాలను నిల్వ చేస్తుండటంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ఈ ముందస్తు చర్యల వల్ల రానున్న వేసవిలో ఓరుగల్లు నగరానికి తాగునీటి బెడద తప్పుతుందని భావిస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us