AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు గుడ్‌న్యూస్‌.. పంట నష్టంపై అదనపు పరిహారం, 3 నెలల పాటు విద్యుత్ బిల్లుల మాఫీ!

ఉత్తరాఖండ్‌లో వడగళ్ల వాన నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పంట నష్టానికి అదనపు పరిహారం, అక్టోబర్-డిసెంబర్ వరకు 3 నెలల విద్యుత్ బిల్లుల మాఫీ ప్రకటించింది. కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై మారటోరియం కోసం కేంద్రాన్ని కోరనుంది. ఇది అన్నదాతలకు ఆర్థిక భారం తగ్గించి, కోలుకోవడానికి సహాయపడుతుంది.

రైతులకు గుడ్‌న్యూస్‌.. పంట నష్టంపై అదనపు పరిహారం, 3 నెలల పాటు విద్యుత్ బిల్లుల మాఫీ!
Electricity Bill Waiver
Balaraju Goud
|

Updated on: Oct 15, 2026 | 4:44 PM

Share

పంట నష్ట పరిహారం: ప్రకృతి వైపరీత్యాలు రైతుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు, వడగళ్ల వాన రూపంలో ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. తాజాగా ఉత్తరాఖండ్‌లో కురిసిన వడగళ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరి, చెరకు, కూరగాయలు, ఉద్యానవన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆపిల్‌, పీచ్‌ వంటి పండ్ల తోటలకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో బాధిత రైతులకు ఉపశమనం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

పంట నష్ట పరిహారంపై కీలక నిర్ణయం

వడగళ్ల వానతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటికే వర్తించే ప్రభుత్వ సహాయానికి అదనంగా పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధికారులను ఆదేశించారు. పంట నష్టం తీవ్రత, ప్రభావిత భూమి విస్తీర్ణం, ప్రభుత్వ నిబంధనల ఆధారంగా రైతులకు అందే పరిహారం నిర్ణయించనున్నారు. అయితే, అదనపు సహాయం ఎంత మొత్తంలో అందుతుంది? అర్హులైన రైతుల ఎంపిక ఎలా ఉంటుంది? అనే పూర్తి వివరాలు అధికారిక మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటాయి.

విద్యుత్ బిల్లుల చెల్లింపుపై ఊరట!

పంటలు దెబ్బతినడంతో రైతుల ఆదాయం తగ్గి, కుటుంబ అవసరాలు, వ్యవసాయ ఖర్చులు భరించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ప్రభావిత రైతులకు అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మూడు నెలల పాటు విద్యుత్‌ బిల్లుల చెల్లింపును వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. దీంతో అర్హులైన రైతులకు తాత్కాలికంగా ఆర్థిక భారం తగ్గనుంది. ఈ వెసులుబాటు అమలుకు సంబంధించిన పూర్తి నిబంధనలు, అర్హతలను ప్రభుత్వం ప్రకటించింది.

కిసాన్ క్రెడిట్ కార్డు రుణాలపై మారటోరియం?

పంటల సాగు కోసం అనేక మంది రైతులు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు (KCC) ద్వారా రుణాలు తీసుకుంటారు. పంట నష్టంతో ఆదాయం తగ్గినప్పుడు రుణ వాయిదాలు చెల్లించడం వారికి భారంగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభావిత రైతుల కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై మూడు నెలల మారటోరియం కల్పించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరనున్నట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు. దీనిపై కేంద్రం ఆమోదం లభించాల్సి ఉంది.

తొమ్మిది జిల్లాల్లో 8,300 హెక్టార్లకు పైగా నష్టం

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌ సింగ్‌ నగర్‌, హరిద్వార్‌, డెహ్రాడూన్‌, అల్మోరా, చంపావత్‌, నైనిటాల్‌, రుద్రప్రయాగ్‌, తెహ్రీ, పౌరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు వడగళ్ల వాన ప్రభావానికి గురయ్యాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 8,300 హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రాంతాన్ని బట్టి నష్టం 10 నుంచి 70 శాతం వరకు ఉన్నట్లు అంచనా. వరి, చెరకు, కూరగాయలు, పండ్ల తోటలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

మొత్తంగా పంట నష్ట పరిహారం, విద్యుత్‌ బిల్లుల చెల్లింపుపై తాత్కాలిక వెసులుబాటు, కిసాన్‌ క్రెడిట్‌ కార్డు రుణాలపై ప్రతిపాదిత మారటోరియం ద్వారా రైతులకు ఉపశమనం కల్పించడంపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే, పరిహారం పంపిణీ, విద్యుత్‌ బిల్లుల వాయిదా, రుణాలపై మారటోరియం అమలుకు సంబంధించిన తుది మార్గదర్శకాలు, అధికారిక ప్రకటించాల్సి ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us