Nature of Earth: భూమిపై మరణం లేని జీవులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!

|

Oct 18, 2021 | 3:43 AM

Nature of Earth: ‘‘పుట్టిన వానికి మరణం తప్పదు.. మరణించిన వాడు జన్మించక తప్పదు..’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు హితబోధ చేసిన విషయం తెలిసిందే.

Nature of Earth: భూమిపై మరణం లేని జీవులు కూడా ఉన్నాయని మీకు తెలుసా?.. ఆసక్తికర విశేషాలు మీకోసం..!
Fish
Follow us on

Nature of Earth: ‘‘పుట్టిన వానికి మరణం తప్పదు.. మరణించిన వాడు జన్మించక తప్పదు..’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు హితబోధ చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకారం భూమ్మీద పుట్టే ప్రతి జీవికీ మరణం తప్పదు. ఏదో ఒక కారణంతో ప్రతి జీవీ మరణిస్తుంది. అయితే, ప్రతీ జీవికి కాల పరిమితి అనేది ఉంటుంది. ఉదాహరణకు మనుషుల ఆయుష్షు గరిష్టంగా 130–150 సంవత్సరాలు అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంతకుమించి బతికారనిగానీ, బతుకుతారని గానీ చెప్పేందుకు ఆధారాల్లేవు. తాబేళ్లు వంటి జీవులు 250 ఏళ్ల వరకు జీవిస్తాయని గుర్తించారు. కానీ ఎలాంటి ప్రమాదం, రోగాలు వంటివి లేకుంటే.. చావు అనేదే లేకుండా వేలకు వేల ఏళ్లు బతికుండే జీవులు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం..

సముద్రంలో జీవించే ‘టుర్రిటోప్సిస్‌ డోహ్రిని’అనే రకం జెల్లీఫిష్‌కి మాత్రం వయసు పెరగడం అంటూ ఉండదని, సహజంగా వీటికి చావు లేనట్టేనని అమెరికన్‌ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. అర సెంటీమీటరు పరిమాణంలో ఉండే ఈ జీవులు సన్నగా వెంట్రుకల్లా ఉండే టెంటకిల్స్‌తో అందంగా కనిపిస్తాయి. కానీ ఈ జెల్లీఫిష్‌కి ఏదైనా గాయం కావడమో, ఇంకేదైనా సమస్య రావడమో జరిగితే.. తిరిగి పిండంగా మారిపోయి, మళ్లీ జెల్లీఫిష్‌గా ఉత్పత్తి అయి ఎదుగుతుంది. ఎప్పటికీ ఇలా జరుగుతూనే ఉంటుందట. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఈ జెల్లీఫిష్‌లకు మెదడు, గుండె కూడా ఉండవట. ఇలాంటిదే మరో సముద్ర జీవి పేరు హైడ్రా. ఇది ఒక సెంటీమీటర్‌ వరకు పెరుగుతుంది. చూడటానికి జెల్లీఫిష్‌లా కనిపించే ఈ జీవి కూడా దాదాపు చావులేనిదే. దీని శరీరం చాలా వరకు మూలకణాలతో నిర్మితమై ఉంటుందట. మూలకణాలకు శరీరంలో ఏ అవయవంగానైనా, ఏ కణజాలంగా అయినా మారే సామర్థ్యం ఉంటుంది. దనివల్ల హైడ్రాకు గాయాలైనా, ఏ భాగం దెబ్బతిన్నా తిరిగి పునరుత్పత్తి అవుతాయి. అందువల్ల ఈ జీవులకు వృద్ధాప్య ఛాయలే కనబడవు.

అంటార్కిటికా మహాసముద్రం అడుగున జీవించే ‘గ్లాస్‌ స్పాంజ్‌’లు వేల సంవత్సరాలు జీవిస్తాయట. అత్యంత శీతల పరిస్థితుల్లో, అత్యంత మెల్లగా పెరిగే ఈ జీవులు 10 నుంచి 15 వేల ఏళ్లపాటు జీవిస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నార్త్‌ అట్లాంటిక్‌ సముద్రంలో ఉండే ‘ఓసియన్‌ క్వాహోగ్‌’ రకం ఆల్చిప్పలు కూడా 507 ఏళ్లు జీవిస్తాయని అమెరికా నేషనల్‌ మ్యూజియం శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. అలాగే ఆర్కిటిక్, అట్లాంటిక్‌ మహాసముద్రాల్లోని లోతైన ప్రాంతాల్లో జీవించే గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌లు 250 ఏళ్లకు పైనే జీవిస్తాయట. ఎరుపు, తెలుపు రంగులతో పెయింట్‌ వేసినట్టు అందంగా ఉండే చేపలు కొయి కార్ప్స్‌. అక్వేరియంలలో పెంచుకునే ఈ చేపలు సాధారణంగా 40 ఏళ్లు జీవిస్తాయని చెప్తారు. కానీ 1977లో జపాన్‌ తీరంలో పట్టుకున్న ఒక కొయికార్ప్స్‌పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు దాని వయసు 226 ఏళ్లు అని గుర్తించారు. ఎక్కువ కాలం జీవించే మరో జీవి తొండలా ఉండే ‘ట్వటరా’. న్యూజిలాండ్‌లో మాత్రమే కనిపించే ఇవి.. వందేళ్ల వరకు బతుకుతాయని శాస్త్రవేత్తలు తేల్చారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. వీటికి తలపై మధ్యభాగంలో మూడో కన్ను కూడా ఉంటుందట. గుండ్రంగా ఉండి, శరీరం చుట్టూ ముళ్లలాంటి నిర్మాణాలు ఉండే మరో సముద్ర జీవి ‘రెడ్‌సీ ఉర్చిన్‌’. పసిఫిక్‌ మహాసముద్రంలో బతికే ఇవి కనీసం 200 ఏళ్లపాటు బతుకుతాయట.

Also read:

Telangana Fears Tiger: తెలంగాణను బెంబేలెత్తిస్తున్న పెద్ద పులులు.. ఏక కాలంలో రెండు పులుల దాడులు..

Film Festival in Egypt: షాకింగ్ వీడియో.. ఫిల్మ్‌ ఫెస్ట్‌ హాల్‌లో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..

Srikakulam: శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో మత్స్యఘోష.. ఆందోళన వ్యక్తం చేస్తున్నా మత్స్యకారులు..(వీడియో)