Cockroach: ప్రపంచంలోని బొద్దింకలన్నీ చనిపోతే ఏమి జరుగుతుందో తెలిస్తే షాకే..

బొద్దింకలు చాలామందికి అసహ్యంగా అనిపించినా అవి మన పర్యావరణ వ్యవస్థకు అత్యవసరం. నైట్రోజన్‌ను రీసైకిల్ చేస్తూ, అటవీ ప్రాంతాల్లో కుళ్ళిన పదార్థాలను శుభ్రం చేస్తూ, నేల సారవంతానికి తోడ్పడతాయి. అనేక జంతువులకు ఇవి కీలక ఆహార వనరు. బొద్దింకలు లేకుంటే పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, ఆహార గొలుసు విచ్ఛిన్నమై, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Cockroach: ప్రపంచంలోని బొద్దింకలన్నీ చనిపోతే ఏమి జరుగుతుందో తెలిస్తే షాకే..
Importance Of Cockroaches

Updated on: Nov 21, 2025 | 8:49 PM

మన చుట్టూ కనిపించే కీటకాలలో బొద్దింకలు చాలా మందికి అసహ్యంగా, భయానకంగా ఉంటాయి. వంటశాలలు లేదా బాత్రూమ్‌లలో ఇవి కనిపిస్తే అవి ప్రపంచం నుంచే పూర్తిగా అదృశ్యమైతే బాగుండు అని కోరుకునేవారు చాలామంది. అయితే పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. బొద్దింకలు ప్రపంచం నుండి అంతరించిపోతే అది మన పర్యావరణ వ్యవస్థకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది.

బొద్దింకలు ఎందుకు ముఖ్యమైనవి?

బొద్దింకలు లేకుండా పోతే అనేక ముఖ్యమైన సహజ ప్రక్రియలు దెబ్బతింటాయి. పీఎన్‌ఏఎస్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. బొద్దింకలు బ్లాటాబాక్టీరియం అనే బాక్టీరియంను కలిగి ఉంటాయి. ఈ బాక్టీరియం వ్యర్థ పదార్థాలలో ఉన్న నైట్రోజన్‌ను రీసైకిల్ చేసి మొక్కలకు అవసరమైన పోషకాలుగా మారుస్తుంది. ఈ నత్రజని కర్మాగారం కారణంగానే బొద్దింకలు కఠినమైన పరిస్థితులలో కూడా జీవించగలవు.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోగలవు.

అడవుల క్లీనర్‌లు – నేల సారవంతం

బొద్దింకలు కేవలం మన ఇళ్లలోనే కాదు.. అడవుల్లో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ అవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

కుళ్ళిపోవడం: బొద్దింకలు పడిపోయిన చెట్లు, కుళ్ళిన కలప, ఆకులు, కుళ్ళిపోతున్న మొక్కలను కొరికి తింటాయి. వాటిని పోషకాలు అధికంగా ఉండే కణాలుగా మారుస్తాయి.

నష్టం: బొద్దింకలు అదృశ్యమైతే అటవీ ప్రాంతంలో చెత్త పేరుకుపోతుంది. కుళ్ళిపోయే ప్రక్రియ నెమ్మదిస్తుంది. నేల సారవంతం తగ్గుతుంది. చెట్లు బలహీనంగా మారతాయి. ఇది మొత్తం అటవీ వ్యవస్థకు హాని కలిగిస్తుంది.

ఆహార గొలుసులో కీలక పాత్ర

బొద్దింకలు అనేక ఇతర జంతువులకు ఆహార వనరుగా పనిచేస్తాయి. బల్లులు, కప్పలు, పక్షులు, చిన్న క్షీరదాలు, కీటకాలు వంటి అనేక జాతులు ఆహారం కోసం ప్రత్యక్షంగా బొద్దింకలపై ఆధారపడతాయి. బొద్దింకలు అంతరించిపోతే ఈ జంతువులన్నీ ఆహార కొరతను ఎదుర్కొని, అంతరించిపోయే ప్రమాదం ఉంది.

మానవ జీవితానికి ఉపయోగం

బొద్దింకల లోపల ఉండే బ్లాటాబాక్టీరియం నైట్రోజన్‌ను అమైనో ఆమ్లాలు, విటమిన్లుగా మార్చడం ద్వారా వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలకు కూడా మద్దతు ఇస్తుంది. బొద్దింకలు లేకపోతే నేలలో నైట్రోజన్ స్థాయిలు తగ్గి, నేల నాణ్యత క్షీణిస్తుంది. దానిని మెరుగుపరచడానికి తప్పనిసరిగా రసాయన ఎరువులు వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణ కాలుష్యాన్ని మరింత పెంచుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..