అమెరికాలో మళ్లీ ఉరిశిక్ష.. క్రిస్టా పైక్ ఘటన తర్వాత తొలి ఎగ్జిక్యూషన్
అమెరికాలో ఉరిశిక్షలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. టెన్నెస్సీలో క్రిస్టా పైక్‌కు విషపు ఇంజెక్షన్ ద్వారా ఉరిశిక్ష అమలు విఫలమైన ఘటన జరిగిన వారం తర్వాత.. టెక్సాస్‌లో మరో వ్యక్తికి అదే తరహా ప్రాణాంతక ఇంజెక్షన్‌తో ఉరిశిక్ష అమలు చేశారు. దీంతో ఆ ఘటన తర్వాత అమెరికాలో అమలు చేసిన తొలి ఉరిశిక్షగా ఇది నిలిచింది.

క్రిస్టా పైక్‌కు సెప్టెంబర్ 30న టెన్నెస్సీ రాష్ట్రంలో పెంటోబార్బిటాల్ అనే ప్రాణాంతక ఇంజెక్షన్‌గా ఇచ్చి ఉరిశిక్ష అమలు చేయాలని చూసారు. అయితే రెండు డోసులు ఇచ్చినప్పటికీ ఆమె మరణించలేదు. అమెరికాలో ఇలాంటి ప్రాణాంతక ఇంజెక్షన్ నుంచి ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడిన ఇదే తొలిసారి. ఉరిశిక్ష అమలు విఫలమైన తర్వాత క్రిస్టా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పుడు ఆమె మళ్లీ కళ్లు తెరిచి మాట్లాడుతోంది. నాష్‌విల్లేలోని ఆసుపత్రి గదిలో మెలకువ వచ్చిన తర్వాత క్రిస్టా అక్కడ ఉన్నవారిని చూసి.. ‘నేను ఎక్కడ ఉన్నాను?’, ‘మీరెవరు?’ అని అడిగినట్లు సమాచారం.
ఉరిశిక్షను ఆపాలని న్యాయవాదుల ప్రయత్నం
క్రిస్టా పైక్ ఘటన జరిగిన వెంటనే టెక్సాస్ కూడా అదే విధంగా తొందరపడకూడదని హోవార్డ్ న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే టెక్సాస్ కోర్ట్ ఆఫ్ క్రిమినల్ అప్పీల్స్ ఉరిశిక్షను నిలిపివేయాలన్న అభ్యర్థనను తిరస్కరించింది. చివరి నిమిషంలో అమెరికా సుప్రీంకోర్టులో చేసిన అప్పీల్‌ను కూడా బుధవారం న్యాయమూర్తులు తిరస్కరించారు. అయితే క్రిస్టా పైక్ కు ఇచ్చిన ఇంజెక్షనే ఇచ్చి 46 ఏళ్ల జమాల్ హోవార్డ్‌కు బుధవారం టెక్సాస్‌లో ఉరిశిక్ష అమలు చేసారు. హంట్స్‌విల్లే జైలులో పెంటోబార్బిటాల్ ను ప్రాణాంతక మోతాదులో ఇవ్వడంతో రాత్రి 8:03 గంటలకు హోవార్డ్ మరణించినట్లు అధికారులు ప్రకటించారు.
2001 హత్య కేసులో మరణశిక్ష
జమాల్ హోవార్డ్‌కు 2001లో మరణశిక్ష పడింది. ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో దోపిడీకి పాల్పడి, అక్కడ పనిచేస్తున్న 42 ఏళ్ల విక్కీ స్వార్టౌట్‌ను కాల్చి చంపిన కేసులో దోషిగా నిర్ధారించారు. ఉరిశిక్షకు ముందు హోవార్డ్.. విక్కీ స్వార్టౌట్ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడు. వారిని మరణశిక్ష చూసేందుకు జైలు డెత్ చాంబర్‌కు అనుమతించారు. తాను చేసిన ఘటనకు క్షమించాలని, ఏదో ఒక రోజు తనను క్షమిస్తారని ఆశిస్తున్నానని హోవార్డ్ వారికి చెప్పాడు.
మేధో వైకల్యం ఉందన్న వాదన
నేరం జరిగిన సమయంలో హోవార్డ్‌కు మేధో వైకల్యం ఉందని, అందువల్ల అమెరికా సుప్రీంకోర్టు 2002లో ఇచ్చిన తీర్పు ను రద్దు చేయాలని హోవార్డ్ తరఫు న్యాయవాదులు వాదించారు. జమాల్ హోవార్డ్‌కు అమలు చేసిన ఉరిశిక్షతో ఈ ఏడాది టెక్సాస్‌లో మరణశిక్షకు గురైన వారి సంఖ్య ఆరుకు చేరింది. 2026లో ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 30 మందికి ఉరిశిక్ష అమలు చేసినట్లు సమాచారం.టెక్సాస్‌లో మరో ఇద్దరికి కూడా భవిష్యత్తులో ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా ఉరిశిక్షలు అమలు చేయాల్సి ఉంది. క్రిస్టా పైక్‌కు ఉరిశిక్ష అమలు విఫలం కావడంతో పెంటోబార్బిటాల్ వినియోగం, దాని నాణ్యత, గడువు, ఉరిశిక్ష ప్రక్రియపై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు అదే మందుతో టెక్సాస్‌లో హోవార్డ్‌కు ఉరిశిక్ష అమలు చేయడంతో ఈ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.