కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం మల్లీశాల అనే గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మూడు నెలల కిందట మాయమైన ఓ వ్యక్తి అస్తిపంజరమై బయటపడటం స్థానికంగా కలకలం రేగింది. కొండపోడు భూమికి సంబంధించిన విషయంపై జూన్ 5వ తేదీన సదరు వ్యక్తి విజయవాడకు వెళ్తున్నట్లు అతడి భార్యకు చెప్పి బయల్దేరాడు. అయితే ఆ తర్వాత అతడు ఇంటికి చేరుకోలేదు.
నెలలు గడుస్తున్నా భర్త గురించి ఆచూకీ తెలియకపోవడం, ఇంటికి రాకపోవడంతో.. అతడి భార్య గ్రామంలోని పలువురిని వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ క్రమంలోనే వారి ఇంటి వెనుక నుంచి ఘాటైన దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. సెప్టిక్ ట్యాంక్‌లో ఓ పాలిథిన్ బ్యాగ్ కనిపించింది. అందులో ఏముందా అని విప్పి చూడగా.. అస్తి పంజరం బయటపడింది. తన భర్తదే అని నిర్ధారించుకున్న భార్య.. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించింది. సమాచారం అందుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకున్న ఖాకీలు.. అస్తిపంజరాన్ని బయటకు తీసి మూలాలు గుర్తించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.