అసలే వేసవికాలం..ఎండలు మండిపోతున్నాయి. ఇంటినుంచి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. వాతావరణం ఎలా ఉన్నా ఉద్యోగులు తమ విధులు తప్పక నిర్వర్తించాలి. ఇక ఈ వేసవి సమయంలో కడుపులో కాస్త ఆహారం పడగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అలా విధుల్లో ఉన్న ఓ స్టేషన్ మాస్టర్‌కి నిద్ర ముంచుకురావడంతో పాపం రైలు వచ్చిన సంగతే అతను గమనించలేదు. అరగంటపాటు పట్టాలపై ట్రైన్ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారులు ప్రయాణీకులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
అధికారులు వెల్లడించిన ప్రకారం.. పట్నా- కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్ ట్రైన్ మే 3న ఉడిమోర్ జంక్షన్‌కు వద్దకు వచ్చింది. అయితే.. అప్పటికే అక్కడున్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకున్నాడు. మరోవైపు గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకోపైలట్ అక్కడే నిలిపేశాడు. స్టేషన్ మాస్టర్‌ను మేల్కొలిపేందుకు లోకోపైలట్ అనేక సార్లు హారన్ కొట్టినా ఫలితం లేదు. దాంతో రైలు పట్టాలపై అరగంటపాటు నిలిచిపోయింది. దీంతో ఆ రైలులోని ప్రయాణికులు అసహనానికి గురైయ్యారు. డ్యూటీలో అలసత్వాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే ఉన్నతాధికారులు.. స్టేషన్ మాస్టర్‌నుంచి వివరణ కోరారు. అనంతరం తగు క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్‌వో ప్రశస్తి శ్రీవాస్తవ వెల్లడించారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తనతోపాటు విధుల్లో ఉన్న పాయింట్‌మెన్ ట్రాక్ చెకింగ్‌కు వెళ్లడంతో.. తాను స్టేషన్‌లో ఒంటరిగా ఉన్నట్లు తెలిపాడని వెల్లడించాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..